తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం సంపత్రావుపల్లికి చెందిన మేకల చంద్రయ్య జీహెచ్ఎంసీలో గుత్తేదారుగా పనిచేస్తూ... హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ట్రిప్పుకు రూ.2500 చొప్పున ట్యాంకర్ ద్వారా జీహెచ్ఎంసీకి మంచినీటిని సరఫరా చేసేవాడు. ట్యాంకర్ డ్రైవర్‌గా సరూర్ నగర్‌కు చెందిన శ్రీకాంత్‌ను నియమించాడు. కొంతకాలం తర్వాత శ్రీకాంత్ సొంతంగా ట్యాంకర్ కొనుగోలు చేసి.. మంచినీళ్లు తరలించేందుకు జీహెచ్ఎంసీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ క్రమంలో మంచినీట సరఫరాకు సంబంధించి శ్రీకాంత్ తనకు మూడున్నర కోట్ల రూపాయలు ఇవ్వాలని మేకల చంద్రయ్య-శ్రీకాంత్‌తో గొడవ పడ్డాడు. ఈ విషయంపై మాట్లాడుకుందామని చెప్పి.. ఈ నెల 11న చంద్రయ్య... శ్రీకాంత్‌ని సంపత్రావుపల్లికి తీసుకొచ్చి సొంతిట్లో బంధించాడు. శ్రీకాంత్ తీసుకురమ్మన్నాడని చెప్పి.. తరువాత రోజు ఆయన భార్య, పిల్లల్ని సైతం తీసుకొచ్చి నిర్బంధించాడు.
తిండిలేకుండా చిత్రహింసలు
డబ్బుల కోసం వారం రోజుల పాటు వారిని చిత్రహింసలకు గురిచేశాడు. వారిని కొట్టేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కిరాయి గుండాలను సైతం రప్పించాడు. బాధితులను కొడుతుండగా వారి అరుపులను విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అర్థరాత్రి రంగప్రవేశం చేసిన పోలీసులు.. బాధితులను రక్షించారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తమను విచక్షణారహితంగా గాయపరిచారని, ఇనుపకడ్డీని కాల్చి వాతలు పెట్టేవారని బాధితులు వాపోయారు. వాతలపై కారం, ఉప్పు నీళ్లు చల్లేవారని... ఒక్కపూట తిండిపెట్టి చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు.
తప్పించుకున్న నిందితుడు
పోలీసులు వెళ్లేసరికి నిందితుడు చంద్రయ్య తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు చంద్రయ్యపై కేసు నమోదు చేశామని ఎస్సై రాము తెలిపారు. చంద్రయ్య కారును స్వాధీనం చేసుకుని... పత్రాలు పరిశీలించగా నకిలీవని తెలిసిందని పేర్కొన్నారు. పూర్తి విచారణ చేసిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుందని ఎస్సై తెలిపారు.
పలు అనుమానాలు
సంపత్రావుపల్లి గ్రామానికి చెందిన మేకల చంద్రయ్య వ్యవహారంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్ల పేరుతో జనం నుంచి రూ. 4కోట్లు వసూలు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. జనం నుంచి వసూలు చేసిన డబ్బు విషయంలోనే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి కిడ్నాప్‌నకు దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, వారి పీఏలు తెలుసని రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
నోరు విప్పితేనే...
ప్రస్తుతం బాధితుడు శ్రీకాంత్ తీవ్రంగా గాయపడిన స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు నిందితుడు మేకల చంద్రయ్య పరారీలో ఉన్నాడు. ఇద్దరిలో ఎవరో ఒకరు నోరువిప్పితే తప్ప... అసలు విషయం బయటికొచ్చే అవకాశం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల వ్యవహారంలో ప్రముఖులు భాగస్వామై ఉండటంతో కేసులో పోలీసులు గోప్యత పాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి:ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్!