పోలవరం ప్రాజెక్టుకు నిధులే ప్రధాన అజెండాగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో ప్రాజెక్ట్ అథారిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సభ్యకార్యదర్శి రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ జలజవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు 20వేల 398 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామన్న కేంద్ర ఆర్థికశాఖ ప్రకటన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులు మాత్రమే ఇస్తే ప్రాజెక్టును ఎలా పూర్తి చేయగలమని.. రూ.28 వేల కోట్లకు పైగా వ్యయమయ్యే పునరావాసం పరిస్థితి ఏమిటని ఏపీ ప్రశ్నిస్తోంది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా మొత్తం 47వేల 725 కోట్ల రూపాయలను పరిగణలోకి తీసుకుని నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రధానికి సీఎం జగన్ ఇప్పటికే లేఖ రాశారు. అథారిటీ సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం
అటు పోలవరం ముంపుపై మరోసారి అధ్యయనం చేయాలని తెలంగాణ కోరుతోంది. పూర్తి నిల్వ సామర్థ్యాన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తే భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాలు ముంపునకు గురవుతాయని..ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూడాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ అథారిటీకి లేఖ రాశారు. ఈ అంశంపైనా చర్చ జరిగింది.
ఇదీ చదవండి: