సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు జీవితకాలం స్వప్నం. నెలకు రూ.50-60 వేల జీతం వచ్చే ఒక ప్రభుత్వ ఉద్యోగైనా, ప్రైవేటు ఉద్యోగైనా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. దాచుకున్న ప్రతి రూపాయీ వెచ్చించాలి. బ్యాంకుల చుట్టూ తిరిగి రుణం తీసుకోవాలి. ఆ తర్వాత 15-20 ఏళ్లపాటు బ్యాంకులకు వాయిదాలు కట్టాలి. అలా కొన్న ఇంటికో, ఫ్లాట్‌కో రాబోయే రోజుల్లో ధర పెరుగుతుందని, తమ పిల్లలకు ఒక ఆస్తిగా, భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందని ఆశ పడతారు. ఉద్యోగం, వ్యాపారం, పిల్లల చదువుల కోసం వేరే చోట ఉండాల్సి వచ్చినా ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వొచ్చని అనుకుంటారు. నెల నెలా బ్యాంకుకు కట్టాల్సిన వాయిదాలో కొంత మొత్తం అద్దె రూపంలో వస్తే భారం తగ్గుతుందని ఆశిస్తారు. సొంతగా ఇల్లో, ఫ్లాటో కొనుక్కోవాలనుకున్నవారు ఎక్కడ అభివృద్ధి జరుగుతోందో, ఎక్కడ ధరలు పెరిగే అవకాశముందో చూసి అక్కడ కొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించాక చాలా మంది అదే చేశారు.విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు, తాడేపల్లి నుంచి అటు నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి అటూ ఇటూ వచ్చిన నిర్మాణ ప్రాజెక్టుల్లో వేలాది ఫ్లాట్లు కొనుగోలు చేశారు. వారిలో ఇప్పటికే మొత్తం డబ్బు చెల్లించినవారు, అడ్వాన్సులు ఇచ్చినవారు, సగం చెల్లించినవారు... ఇలా వివిధ కేటగిరీల వారున్నారు. ఫ్లాట్లు కొన్నవారిలో 75 శాతానికి పైగా మధ్యరతగతి, కాస్త ఎగువ మధ్యతరగతికి చెందిన వారే. ఇలాంటి వారికి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయం శరాఘాతంగా మారింది. కొన్న ఆస్తి విలువ కళ్ల ముందే కరిగిపోతుండటం పెట్టిన డబ్బయినా తిరిగి రాని, అద్దెకు ఇద్దామన్నా దిగేవారులేని పరిస్థితి నెలకొనడంతో అనేక మంది తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.
రాజధాని కోసమే కొన్నారు..!
సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో... వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు తరలి వచ్చారు. వీరిలో అత్యధికులు రాజధానికి దగ్గర్లోనే తమకో సొంత నివాసం ఉండాలని ఆశపడ్డారు. అమరావతిలో ప్రభుత్వం తొలి దశలో ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టడంతో ప్రైవేటు నిర్మాణ ప్రాజెక్టులు రాలేదు. అప్పటికే రాజధానికి ఏర్పడిన డిమాండును అందిపుచ్చుకునేందుకు పెద్ద పెద్ద భవన నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తాడేపల్లి నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం వరకు కొన్ని వందల నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టారు. వీటికి విపరీతమైన గిరాకీ కూడా ఏర్పడింది. జాతీయ రహదారికి అటూ, ఇటూ ఉన్న ప్రాంతం కావడం, దాదాపుగా రాజధాని అమరావతిని ఆనుకునే ఉండటంతో అక్కడ ఫ్లాట్ కొనుక్కున్నా రాజధానిలో ఉన్నట్టేనని చాలా మంది భావించారు. పెద్ద ఎత్తున వాణిజ్య నిర్మాణాలు మొదలవడం, ఐటీ కంపెనీల వంటివి అక్కడికి వచ్చేందుకు మొగ్గు చూపడంతో అదో గ్రోత్‌కారిడార్‌లా, ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డారు. హైకోర్టు న్యాయవాదులు, హైదరాబాద్, బెంగళూరులలో పని చేస్తున్న ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రవాసాంధ్రులు సహా వేల మంది ఈ ప్రాంతంలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. గుంటూరు, విజయవాడలలో కూడా పెద్ద ఎత్తున అపార్టుమెంట్ల నిర్మాణం జరిగింది.
నిర్మాణాలు ఇలా..
రాజధానిగా అమరావతిని ప్రకటించాక ఇప్పటి వరకు విజయవాడ, గుంటూరుతో పాటు, తాడేపల్లి-నాగార్జున యూనివర్సిటీ మధ్య ఉన్న ప్రాంతాల్లో సుమారు 7-8 కోట్ల చ.అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన నివాస భవనాల నిర్మాణం మొదలై వివిధ దశల్లో ఉన్నట్టు అంచనా. వాటిలో చిన్నా పెద్దా కలిపి లక్ష ఫ్లాట్లు ఉంటాయని ఇందులో ఇప్పటికే 40-50 వేల ఫ్లాట్ల విక్రయాలు జరిగాయని నిర్మాణరంగానికి చెందినవారు చెబుతున్నారు. కోటి చ.అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన వాణిజ్య భవనాల నిర్మాణం చేపట్టినట్టు సమాచారం. తాడేపల్లి నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం మధ్య సుమారు 15 పెద్ద నిర్మాణ కంపెనీలు చేపట్టిన భారీ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో దాదాపు 11 వేల ఫ్లాట్లు పూర్తవడమో, నిర్మాణ దశలోనో ఉన్నాయి. ఆ ప్రాంతంలో 20 నుంచి 100 ఫ్లాట్లతో నిర్మించిన, నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌లు వందల్లో ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే సుమారు రూ.8-10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు అంచనా. ఈ ప్రాంతాల్లో నివాసాలు కొనుగోలు చేసినవారికి వివిధ బ్యాంకులు రూ.20 వేల కోట్ల వరకు గృహ రుణాలు ఇచ్చాయని అంచనా.
ఒక్కో ఫ్లాట్‌పై కనీసం రూ.50-60 లక్షలు..!
మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు కొనేందుకు మొగ్గు చూపుతారు. డబుల్ బెడ్ రూమ్ అంటే సుమారు 1200 చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది. పెద్ద సంస్థల ప్రాజెక్టుల్ని పక్కన పెడితే.... చిన్న ప్రాజెక్టుల్లో ఒక్కో చ.అడుగు కనీస ధర రూ.3,800 నుంచి మొదలైంది. అక్కడ చాలా మంది ఒక్కో ఫ్లాట్‌పై కనీసం రూ.50-60 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇందులో ఎక్కువ శాతం రుణంగా తీసుకున్నదే. ఫ్లాట్లు కొన్నవారు సగటున నెలకు రూ.25-40 వేలు బ్యాంకులకు వాయిదా కట్టాల్సి వస్తోంది. ‘‘సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలిపోతే నేను ఇక్కడ కొనుక్కున్న ఇల్లు అద్దెకు ఇచ్చుకోవాలి. ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలే లేనప్పుడు అద్దెకు మాత్రం ఎవరొస్తారు? బ్యాంకు వాయిదా ఎలా కట్టాలి, విశాఖలో ఇల్లు తీసుకుంటే అద్దె కట్టుకోవాలి. ఇక్కడ నేను కొనుక్కున్న ఫ్లాట్ నిరర్ధక ఆస్తిగా మారిపోయే ప్రమాదం ఉంది’’ అని సచివాలయ ఉద్యోగి ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు.
వివాదాలకూ ఆస్కారం...!
* ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చినప్పటి నుంచీ ఇక్కడ పలు ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలనుకున్నవారు విరమించుకున్నారు.
* ఇప్పటికే మొదలైన ప్రాజెక్టుల్లో అడ్వాన్స్‌లు ఇచ్చి ఫ్లాట్‌లు బుక్ చేసుకున్నవారు, అవి ఆగిపోవడంతో తమ భవిష్యత్తేంటో తెలియక ఆందోళన చెందుతున్నారు.
* ఏ ఐదో అంతస్తులోనో ఫ్లాట్ బుక్ చేసుకున్నవారు, నిర్మాణం ఇంకా అక్కడి వరకు రాకపోవడంతో... తదుపరి రుణం విడుదల చేయవద్దని బ్యాంకులకు చెబుతున్నారు. తాము కట్టిన అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాలని బిల్డర్లను కోరుతున్నారు. వారు నిరాకరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివన్నీ న్యాయపరమైన వివాదాలకు దారితీసే అవకాశముందని ఒక బిల్డర్ తెలిపారు.
* రాజధానిలో వివిధ నిర్మాణ ప్రాజెక్టుల్లో పనిచేసే ఇంజినీర్లు, సిబ్బంది తాడేపల్లి-మంగళగిరి ప్రాంతాల్లో నిర్మించిన అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌లు అద్దెకు తీసుకున్నారు. ఇప్పుడు వారంతా వెళ్లిపోవడంతో అక్కడ చాలా ఫ్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్