Pingali Venkayya: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలను.. ఆగస్టు 2న ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి తెలిపారు. మంగళవారం దిల్లీలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతాయని, ప్రధాన కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలన్నదానిపై తుది నిర్ణయానికి రాలేదన్నారు. ఇందులో పింగళి కుటుంబ సభ్యులనూ భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు.
అదే రోజు నుంచి దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ (ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా) ప్రచారోద్యమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న దేశంలోని ప్రతి ఇంటి మీద మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన జెండాల రూపకల్పన బాధ్యతలను రాష్ట్రాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించినట్లు వెల్లడించారు.
వీటితోపాటు జెమ్ పోర్టల్, ఈ కామర్స్ వేదికలు, ఖాదీ భండార్లు, బహిరంగ మార్కెట్ల నుంచి ప్రజలు కొనుగోలు చేసి ఇళ్ల మీద ఎగురవేయవచ్చని అన్నారు. ఇందులో ప్రైవేటు రంగం, పౌరసమాజాన్ని కూడా భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ప్రజలు జెండాలు కొనేలా ప్రోత్సహిస్తామని, ఎవరి జెండా వారు కొనుగోలు చేసి ఇళ్లపై ఎగరేయడం వల్ల అది వారి సొంతమన్న భావన కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: