చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి లోకేశ్వరవర్మను బాధ్యతల నుంచి తొలగించి తక్షణం మరో ఆర్వోను నియమించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కుప్పం 20 వ వార్డు తెదేపా నుంచి ఎన్నికల బరిలో ఉన్న వెంకటరమణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆయన తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వ్యాజ్యంపై అత్యవసరంగా (లంచ్ మోషన్ లో) విచారణ జరపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి వద్ద ప్రస్తావించారు. సోమవారం విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఈనెల 15 న ఎన్నికలు జరగనున్న కుప్పం మున్సిపాలిటీకి ఆర్వోగా నియమితులైన లోకేశ్వరవర్మ పుంగనూరు మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆర్వోగా పని చేయడానికి కుప్పం మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పటికీ ఎన్నికల కోసం ప్రత్యేక అధికారిగా పుంగనూరు మున్సిపల్ కమిషనర్‌ను నియమించారని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిడి కారణంగా ఆయన్ని ప్రత్యేక అధికారిగా నియమించారన్నారు. పుంగనూరు మున్సిపాలిటీలో ఆయనపై పలు ఆరోపణలున్నాయని.. ఆయక ఆర్‌వోగా కొనసాగితే ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదన్నారు. అధికారపార్టీకి అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేయించేందుకు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
అధికార పార్టీకి అనుకూలంగా ఆర్వో వ్యవహరిస్తూ.. తనతోపాటు ఇతరుల నామినేషన్లను తిరస్కరిస్తారనే ఆందోళన కలుగుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. మరోవైపు నామినేషన్ దాఖలు చేయకుండా కొందరు బెదిరిస్తున్నారన్నారు. వెలుగు వర్కర్లతో ఆర్వో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించి అధికారపార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పారన్నారు. రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని వివరించారు. వెలుగు వర్కర్లు, వాలెంటీర్లు, అంగన్వాడీలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందిని అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఆర్వోను మార్చాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్, చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు వినతి సమర్పించామని తెలిపారు.
ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తక్షణం ఆర్వోను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా తరఫున పోటీ చేస్తున్న తనతో పాటు ఇతర సభ్యులకు అధికార పార్టీ నుంచి బెదిరింపులకు తావులేకుండా స్వేచ్ఛాయుతంగా ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుకల్పిస్తూ పోలీసు రక్షణ కల్పించాలని వెంకటరమణ పిటిషన్‌లో కోరారు.
ఇదీ చదవండి: