కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ సూచనలు చేశారు.
ఏపీ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని తెలంగాణ పేర్కొంది. ఇప్పటికే కేంద్రం గెజిట్ జారీచేసిందన్న తెలంగాణ తరఫు న్యాయవాది.. అక్టోబర్ నుంచి గెజిట్ అమలులోకి వస్తుందని ఉన్నత ధర్మాసనానికి వెల్లడించారు. ఇప్పట్నుంచే గెజిట్ అమలు చేయాలని కోరుతున్నామని ఏపీ పేర్కొంది. నాలుగు నెలలపాటు నీటిని నష్టపోకూడదనే అడుగుతున్నామని స్పష్టం చేసింది.
కేంద్రం నుంచి ఇంకా ఏమైనా సూచనలు కావాలంటే వాయిదా వేస్తామని సీజేఐ అన్నారు. విచారణ వాయిదా వేసి మరో ధర్మాసనానికి పిటిషన్ పంపుతామన్నారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని.. కృష్ణా జలాల వివాదంపై గతంలో వాదించానన్న జస్టిస్ ఎన్.వీ.రమణ అన్నారు. ప్రభుత్వాలతో సంప్రదించి రావాలని 2 రాష్ట్రాల తరఫు న్యాయవాదులకు సూచించారు. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 4కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన జీఎస్‌టీ ఆదాయం