రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో అంకెల గారడీ చేస్తోందని.. గోరంత చేసి, కొండంత దోచుకుంటూ ప్రజల్ని మోసగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దీనిపై తమతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రభుత్వానిది మోసకారి సంక్షేమం, అమలు చేస్తోంది నకిలీ రత్నాలని నిరూపిస్తామన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం ఏ వర్గానికి ఏం చేసిందో గ్రామసభల్లో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైకాపా గంపగుత్తగా అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. విభజనచట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల్లో ఈ రెండేళ్లలో ఎన్ని సాధించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే ముఖ్యమంత్రి, వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు శుక్రవారం తెదేపా మహానాడులో వివిధ తీర్మానాలపై మాట్లాడటంతో పాటు ముగింపు ఉపన్యాసం చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడిన విషయాలు..
చెప్పేవన్నీ అబద్ధాలే
ఈ ప్రభుత్వం చెప్పేవన్నీ అవాస్తవాలు. చేసేవన్నీ మోసాలు. ప్రతి స్కీమ్‌నీ.. స్కామ్‌గా మార్చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది. దొంగ లెక్కలు రాయడంలో ఎ1, ఎ2లకు బాగా అనుభవం ఉంది. రూ.3 వేలు పింఛను ఇస్తామని చెప్పి రూ.250 మాత్రమే పెంచారు. రైతులకు రూ.13,500 ఇస్తామని, కేంద్రం ఇచ్చేదీ వీళ్ల లెక్కల్లో చూపిస్తున్నారు. ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చి, రూ.30 వేలు దోచుకుంటున్నారు. అన్న క్యాంటీన్లు సహా తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు చేశారు. పింఛన్లు, పీడీఎస్ రాయితీల్ని కూడా.. వ్యవసాయం కోసం చేస్తున్న ఖర్చులో చూపిస్తున్నారు. అంకెలు తారుమారు చేసి, ప్రతివారం ప్రకటనలతో మభ్యపెడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా అమల్లో ఉన్న పథకాల్ని రద్దు చేసి, ఈ ముఖ్యమంత్రి ఏదో కొత్తగా రూపకల్పన చేసినట్టుగా చెప్పి మోసం చేస్తున్నారు.
ఎక్కడ చూసినా వైకాపా మాఫియానే
రాష్ట్రంలో ఇసుక, సిమెంట్, మద్యం, మైనింగ్... అన్నీ వైకాపా మాఫియా హస్తగతం చేసుకుంది. ఉచితంగా ఇచ్చే ఇసుకను వివాదాస్పదం చేశారు. గంపగుత్తగా ఒకే కంపెనీకి కట్టబెట్టారు. ఎవరి ఊళ్లో ఇసుకను వాళ్లు తెచ్చుకోవాలన్నా, ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి తెచ్చారు. ముఖ్యమంత్రి తన సొంత సిమెంట్ కంపెనీ కోసం జువారీ సిమెంట్‌ను బలిచేశారు. సిమెంట్ బస్తా ధర రూ.450కి పెంచేశారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకు అంతా వీళ్లదే. దేశంలో ఎక్కడా లేని నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజారోగ్యాన్ని బలి పెడుతున్నారు. పేదలకు సెంటు ఇంటి పట్టా పేరుతో భూమాఫియా సృష్టించారు. జ్యుడీషియల్ కమిషన్ వేస్తే వీళ్ల అరాచకాల్ని ఆధారాలతో నిరూపిస్తాం. రైతు సంఘాల ఆధ్వర్యంలోని డెయిరీలన్నీ మూయించేసి అమూల్‌కి కట్టబెట్టాలనుకుంటున్నారు. అమూల్‌పై ఎందుకంత ప్రేమ? ఏంటా లాలూచీ?
నరేగా బిల్లులు 24% వడ్డీతో చెల్లిస్తాం
నరేగా పనులు చేసినవారికి బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గం. ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. బిల్లులు రాక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. పనులు చేసినవారు బాధపడుతుంటే వీళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. నరేగా బిల్లులపై కోర్టులకూ ప్రభుత్వం అబద్ధం చెబుతోంది. ఇష్టానుసారం ప్రవర్తిస్తోంది. నరేగా బిల్లులు చెల్లించేలా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. పోరాడతాం. అప్పటికీ వీలుకాకపోతే తెదేపా అధికారంలోకి వచ్చాక 24 శాతం వడ్డీతో చెల్లిస్తాం.
ప్రత్యేక హోదాపై ప్రగల్భాలేమయ్యాయి?
ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలొస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ముందు జగన్ ప్రగల్భాలు పలికారు. ‘ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తారు? పోలవరం భూసేకరణ, పునరావాస పనులు ఎప్పటికి పూర్తి చేస్తారు? రైల్వే జోన్ సహా విభజన చట్టంలోని హామీల్ని ఎప్పటికి సాధిస్తారు? వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సమాధానం చెప్పలేకపోతే... ఆ రోజు అన్నది తప్పని చెంపలు వేసుకోంది. మీరు, మీ ఎంపీలు రాజీనామా చేయండి.
అందరికీ వ్యాక్సిన్ వేయాలి
‘కరోనా నియంత్రణలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల పరిస్థితి చేయిదాటింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలి. అమరావతి నిర్మాణం కొనసాగించాలి. అసంపూర్తిగా ఆగిపోయిన నిర్మాణ, రహదారుల పనులు పూర్తి చేయాలి. వ్యవసాయరంగాన్ని ఉద్ధరించామని మీరు చెబుతోంది నిజమైతే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? తెదేపా చెబుతోంది కాబట్టి వ్యతిరేకంగా చేయాలన్న ఆలోచనలు మానుకోండి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఏం చర్యలు చేపడుతున్నారో చెప్పండి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... Jagan Review: కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం సమీక్ష