జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టే విధానానికి ఇప్పటికే స్వస్తి పలికిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచకుండా గోప్యత పాటిస్తోంది. ఆన్‌లైన్‌లో ప్రజలకు తెలిసేలా ఉంచే విధానాన్ని ఆపేసింది. వైఎస్సార్ పింఛను కానుక కింద ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీని చేపడుతోంది. ఆ రోజు పంపిణీ మొదలు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా పింఛనుదారులకు లబ్ధి అందుతున్న తీరును వైఎస్సార్ పింఛను కానుక వెబ్‌సైట్‌లో నమోదు చేసేవారు. గంటకొకసారి వివరాలను అప్‌లోడ్ చేసేవారు. ఆగస్టు నెల వరకు ఈ విధానాన్ని పాటించారు. పింఛన్ల పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఆ విధానాన్ని నిలిపేసి సంబంధిత అధికారులు మాత్రమే లాగిన్ అయి వివరాలు చూసుకునేలా మార్పులు తీసుకొచ్చారు.
గత నెల్లో భారీ మార్పులు..
గత నెలలో పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం భారీగా మార్పులు చేసింది. ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛను విధానాన్ని అమలు చేసింది. ఇతర ప్రాంతాల్లో ఉంటూ రెండు, మూడు నెలలకొకసారి వచ్చి పింఛను తీసుకునే వెసులుబాటును రద్దు చేసింది. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలని స్పష్టం చేసింది. పోర్టబులిటీ విధానాన్ని ఆపేసింది. ఈకేవైసీ చేయించుకోని, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ కాని వారి పింఛన్లను నిలిపేసింది. ఈ ప్రభావం పింఛన్ల పంపిణీలో బహిర్గతమవుతుందనే ఆలోచనతోనే వివరాలు ఆన్‌లైన్‌లో ప్రజలకు కనిపించకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అదనంగా మరో రోజు పంపిణీ...
గత నెల వరకు పింఛన్లను ఒకటో తేదీ మొదలు మూడు రోజులపాటు పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబరు 1నుంచి దాన్ని మరో రెండు రోజులకు పొడిగించి 5 రోజులపాటు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అర్హులకు పింఛను అందలేదన్న ఫిర్యాదులు రావడంతో 6న కూడా పంపిణీకి అనుమతిచ్చారు. సాంకేతిక కారణాల వల్ల నిలిచిన పింఛన్లను పంపిణీ చేయాలని ఆదేశాలు పంపారు. సెప్టెంబరు నెల పింఛను తీసుకోకపోతే అక్టోబర్ నెల పింఛనులో ఆ మొత్తం విడుదల కాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు 88.92% పంపిణీ చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 6వ తేదీ(సోమవారం) నాటికి 98% మందికి పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈకేవైసీ లేని కారణంగా పింఛన్లు నిలిచిపోయిన వారికి బుధవారం నుంచి నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుందని సెర్ప్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: RAINS : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... మునిగిన ఏజెన్సీలోని పలు ప్రాంతాలు