Revanth Reddy Comments: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తనకు ఎలాంటి విభేదాలు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం మీడియాతో రేవంత్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్‌లో భాగంగా రెండు లక్షల రుణమాఫీ, లక్ష వడ్డీ లేని రుణం ప్రకటన ఉంటుందని రేవంత్ తెలిపారు. మంత్రి హరీశ్‌రావుకు రాహుల్ గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను హరీశ్‌రావు, తెదేపాను కేటీఆర్ విమర్శిస్తే జనం ఉమ్మేస్తారని కీలకవ్యాఖ్యలు చేశారు.
పీకే విషయంలో కాంగ్రెస్ ఆలోచన ఏంటో అర్థం చేసుకోవాలని, కేసీఆర్‌తో జట్టు కట్టిన వారిని కాంగ్రెస్ దూరం పెడుతోందన్నారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని కేటీఆర్ విమర్శించారంటే... ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. మొన్న ప్లీనరీలో కూడా ఎన్టీఆర్‌ను పదేపదే తల్చుకున్నారనన్నారు. సమతామూర్తి విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా.. కేసీఆర్‌ను రావొద్దని పీఎంవో స్పష్టంగా చెప్పిందని తెలిపారు.
"కేసీఆర్ దీనమైన రాజకీయ పరిస్థితిలో ఉన్నారు. దేశంలో ఫ్రంట్ అంటున్నారు, ఇతర లీడర్లు తనను ఫాలో అవుతారని ఎక్కువ ఊహించుకుంటున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు ఎక్కడ పోయినా.. ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధ ఎక్కువైందన్నారు. కేసీఆర్, జగన్, ఓవైసీ, నరేంద్రమోదీ ప్రస్తుతానికి ఒక్కటే.. బయటకు మాత్రం డిఫరెంట్‌గా కనబడాలని చూస్తున్నారు. రాహుల్ సభకు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని.. వీలైనంత ఎక్కువ మందిని తరలించడం కోసం ఇంఛార్జిలను నియమించాం. ఈ ఏడు పార్లమెంట్ల పరిధిలో 20 లక్షల మంది సభ్యత్వం నమోదైంది. రాహుల్ సభ కోసం వివిధ కమిటీలు వేస్తున్నాం. పార్కింగ్ ఏరియా నుంచి సభ వరకు 7 సీట్ల ఆటోలను అందుబాటులో ఉంచుతున్నాం." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: మీ రాష్ట్రంలోగా డ్రగ్స్ వినియోగం, పబ్ కల్చర్ ఇక్కడ లేదు: హోంమంత్రి