కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి, ఎస్టీ మహిళ అయిన రొడ్డా భవాని(32) గురువారం అమలాపురం మండలం కామనగరువులోని తన సొంతింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈమెకు భర్త వెంకటేశ్వరరావు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన భవాని పదేళ్ల క్రితం వెంకటేశ్వరరావును పెళ్లి చేసుకున్నారు. ఈమె 2019లో చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా వచ్చారు. మూడు నెలల క్రితం పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. 90 రోజుల గడువు దాటిన మూడు రోజులకు సమావేశం నిర్వహించారు. అప్పట్నుంచి కొందరు ఆమెను వేధిస్తుండడంతో తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. భవాని మృతదేహాన్ని అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు గురువారం సాయంత్రం వరకు ప్రయత్నించారు. డీఎస్పీ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలంటూ.. భవాని బంధువులు డిమాండు చేశారు. ఓ దశలో వాగ్వాదం చోటుచేసుకోగా సీఐ వీరబాబు, ఎస్సై పరదేశి కలుగజేసుకుని సర్దిజెప్పారు. భవాని భర్త వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేయనున్నట్లు ఎస్సై తెలిపారు.
వేధింపులే కారణమా?: ఎస్టీ మహిళ అయిన భవానికి అధికార పార్టీకి చెందిన కొందరి నుంచి వేధింపులు ఎదురయ్యాయని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గ సమావేశం సమయానికి నిర్వహించలేదని ఒక వర్గం వారు జిల్లా పంచాయతీ అధికారికి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని.. ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటే తమకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండు చేశారని చెప్పారు. ఆ మొత్తం ఇచ్చాక మరికొంత అడగడంతో పాటు తీవ్రంగా వేధించడం వల్లే మనస్తాపానికి గురై భవాని ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఆరోపించారు.
ఇదీ చదవండి: