తొలిరోజు నామినేషన్ల ఘట్టం ఉత్కంఠగా మారింది. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఒక పంచాయతీ ఏకగ్రీవానికి గతంలో కుదిరిన ఒప్పందం ఉల్లంఘించారనే మనస్తాపంతో తెదేపాకు చెందిన మాజీ సర్పంచి ఆత్మహత్య ప్రయత్నం చేయడం సంచలనం సృష్టించింది. తొలివిడతలో విజయవాడ డివిజనులోని 234 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు.
మేజరు గ్రామ పంచాయతీలలో రిటర్నింగ్ అధికారులు, ఇతర పంచాయతీలకు స్టేజ్-1 అధికారులు నామినేషన్లను స్వీకరించారు. తొలిరోజే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవానికి ఒప్పందం చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రెండు ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా మధ్య ఒప్పందం కుదిరింది. ఇతరులు నామినేషన్లను వేయకుండా ఒక అంగీకారానికి వచ్చారు. ఈనెల 31 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. అధికారికంగా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరమే ఏకగ్రీవాలను ప్రకటించే అవకాశం ఉంది.
- పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం పంచాయతీ కథ ఆసక్తికరంగా మారింది. గత ఏడాది పరిషత్తు ఎన్నికలకు జరిగిన ఒప్పందంలో వైకాపాకు ఎంపీటీసీ, తెదేపాకు పంచాయతీ సర్పంచి పదవులు ఇవ్వాలని అంగీకారానికి వచ్చారు. నాడు ఎంపీటీసీ నామినేషన్లను వేసి ఏకగ్రీవం చేయాల్సి ఉండగా అర్థంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం సర్పంచ్ పదవి తెదేపాకు ఇవ్వాల్సి ఉంది. కానీ వైకాపా వర్గాలు నామినేషన్లకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో తెదేపాకు చెందిన నేత మనస్తాపం చెంది.. పురుగుల మందును ఇంజక్షన్ రూపంలో శరీరంలోకి ఎక్కించుకున్నారు.
- నందిగామ నియోజకవర్గంలో కీసర, కంచెల, దామలూరు పంచాయతీల్లో ఒక పార్టీ మద్దతుదారుల్లోనే పోటీ నెలకొంది. అధికార పార్టీ మద్దతుదారులు తామంటే తామని పోటీపడుతున్నారు. జనరల్‌కి కేటాయించిన మన్నలూరులో ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. కొణతమాత్మకూరు, మాగల్లులో తెదేపా, వైకాపా మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. సర్పంచి ఒకరు, ఉపసర్పంచి మరొకరు తీసుకునే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు.
- పెనమలూరు నియోజకవరగంలో గోశాల పంచాయతీ పంపకం పూర్తయింది. సర్పంచి వైకాపా మద్దతుదారులకు కేటాయించగా, ఉపసర్పంచి తెదేపా వర్గీయులకు కేటాయించారు. మెజార్టీ వార్డులు తెదేపాకు దక్కనున్నాయి. నామినేషన్ల గడువు ముగిసే వరకు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.
- మైలవరం నియోజకవర్గం జి.కొండూరులో వైకాపా మద్దతుదారులు పోటీ పడుతున్నారు. రెండున్నర సంవత్సరాల చొప్పున అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది.
వైకాపాలోనే ఆధిపత్య పోరు..!
వైకాపా మద్దతుదారుల్లో ఆధిపత్య పోరు కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గం ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నగరానికి ఆనుకొని ఉండే రామవరప్పాడు పంచాయతీలో అధికార పక్షంలోనే రెండు వర్గాలు సర్పంచి పదవికి పోటీ పడుతున్నాయి. ఇంకా చర్చలు జరగలేదు. ప్రసాదంపాడు, ఎనికేపాడులో ఏకగీవ్రాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. సొంత వర్గంలోనే ప్రతిఘటన ఎదురవుతోంది. నున్న పంచాయతీ పరిధిలో ఏకంగా మూడు వర్గాలకు చెందిన మద్దతుదారులు పోటీకి సై అంటున్నారు.డీసీసీబీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావులు ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వ్యతిరేకిస్తున్నారు. మొదటి విడతతో ఎన్నికలు జరిగే 9 పంచాయతీల్లో 5 మేజర్ పంచాయతీలు కావడం ఆసక్తికరంగా మారాయి.
ఇదీ చదవండి: