సెకితో జరిగిన ఒప్పందం, వచ్చిన అభ్యంతరాలు, అనుమానాలకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదంటూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ(pac chairman payyavula keshav letter to state energy secretary news) రాశారు. విద్యుత్ కోనుగోళ్లలో తప్పిదాలు, సెకితో ఆకస్మిక ఒప్పందాలపై కీలక అంశాలు ప్రస్తావిస్తూ ప్రశ్నలు (AP to procure solar power from SECI news) సంధించారు. ఈ నెల తొమ్మిదో తేదీనే లేఖ రాసినా ఇంతవరకూ దానికి స్పందన లేదని.. మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. విద్యుత్ సంస్కరణల ప్రధాన లక్ష్యం దెబ్బతినేలా ప్రజాసేవకుడిగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో.. గ్రిడ్ లో 100 శాతం కంటే అదనపు సామర్ధ్యాన్ని ఎందుకు జోడిస్తున్నారని నిలదీశారు. బిడ్డింగ్ జరపకుండా.. సెకి ఇచ్చిన ఆఫర్‌కు ఏకపక్షంగా ఎలా అంగీకారం తెలిపారో సమాధానం చెప్పాలన్నారు.
సెప్టెంబర్ 15న సెకి నుంచి ప్రతిపాదన వస్తే.. 16వ తేదీనే ఆగమేఘాల మీద ఎందుకు ఆమోదించారని లేఖలో ప్రశ్నించారు. ప్రతిపాదనలు, సంప్రదింపులు, ఒప్పందాల్లో ఈ స్థాయి వేగం వెనుక కారణాలు ఎందుకు స్పష్టం చెయ్యడం లేదని నిలదీశారు. సౌర విద్యుత్తు ధరలు దిగివస్తాయని తెలిసి కూడా.. ప్రభుత్వం వేస్తున్న అడుగులు కొత్త సందేహాలు కలిగిస్తున్నాయని లేఖలో అనుమానం వ్యక్తం చేశారు.
సెకితో వివాదం.. తెదేపా ఆరోపణలు ఏంటంటే..?
సెకితో ఒప్పందంపై పయ్యావుల గత కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదివేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేంద్ర సౌర విద్యుత్ సంస్థ (సెకి)తో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక భారీ కుంభకోణం ఉందన్నారు. ‘‘సెకి 2020 నవంబరు, డిసెంబరు నెలల్లో సౌర విద్యుత్ ప్లాంట్‌ల ఏర్పాటుకి టెండర్లు పిలిస్తే... యూనిట్ విద్యుత్ రూ.2కి, గుజరాత్ ప్రభుత్వం పిలిచిన టెండర్లలో యూనిట్ రూ.1.99కే తక్కువ ధరకు బిడ్లు దాఖలయ్యాయి. అదే సెకితో రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.2.49కి కొనేందుకు ఒప్పందం చేసుకుంది. పైగా దేశంలోనే అతి తక్కువ ధరకు విద్యుత్ కొన్నామని, దానితో రాష్ట్రానికి లాభమేనని ప్రజల్ని మోసగిస్తోంది...’’ అని కేశవ్ ధ్వజమెత్తారు. ఒక పక్క యూనిట్ రూ.1.99కే వస్తుంటే... ప్రభుత్వం రూ.2.49కి కొనడం ఏ విధంగా లాభదాయకం? అని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై ఈఆర్సీ ఛైర్మన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అయితే పయ్యావులతో పాటు తెదేపా నేతలు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. ఈమేరకు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటన కూడా జారీ చేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న డిస్కంలపై ఎలాంటి భారం ఉండదని, ఈ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ‘‘ఈ పథకం కింద తీసుకునే విద్యుత్‌కు 25 ఏళ్ల పాటు అంతర్రాష్ట సరఫరా ఛార్జీల (ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ సప్లై ఛార్జీలు- ఐఎస్‌టీఎస్) మినహాయింపు వర్తిస్తుంది. బయటి ప్రాంతాల్లో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి అవసరమైన సబ్‌స్టేషన్లు, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలాంటి మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేసే దానికంటే తక్కువ ధరకే విద్యుత్ అందుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెకి ప్రతిపాదనపై అపనమ్మకాన్ని కలిగించే కారణం ఏదీ ప్రభుత్వానికి కనిపించలేదు...’’ అని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
CHANDRABABU NAIDU: 'వెంకన్న ఆశీర్వాదంతో అమరావతే రాష్ట్ర రాజధాని అవుతుంది'