రాష్ట్రవ్యాప్తంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు అందజేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో..
పాలకొండ, రాజాం నియోజకవర్గంలోని పలు మండలాల్లో మూడో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. పాలకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఇప్పటికే పోలీసు సిబ్బంది గ్రామాల్లోకి చేరుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో..
రంపచోడవరం నియోజకవర్గంలో రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 11 మండలాల్లోని 186 పంచాయతీలకు.. 14 ఏకగ్రీవం అయ్యాయి. 172 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 1734 వార్డులకు 448 ఏకగ్రీవమయ్యాయి. 1702 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సిబ్బంది ముందు రోజే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో..
పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది సన్నద్దమయ్యారు. ప్రధానంగా మన్యం మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు ఉపాధ్యాయులు, ఇతర శాఖల ఉద్యోగులు చేరుకున్నారు. పోలవరం నియోజకవర్గంలోని 102 పంచాయతీలకు 1098 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ప్రతి కేంద్రానికి పీవో, ఓపీవోలను నియమించడంతో పాటు పరిశీలకులు, ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేశామని జట్పీ డిప్యూటీ సీఈఓ ప్రదేశ్కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా ముందుకు సాగుతున్నామన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో..
నాయుడుపేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అధికారులు అప్పగించారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. బుధవారం జరిగే ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ప్రకాశం జిల్లాలో..
కనిగిరి నియోజకవర్గంలో రేపు జరగనున్న మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అధికారులు అందజేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలో..
మూడో విడత పోలింగ్ నిర్వహణ సామాగ్రి పంపిణీ మొదలైంది. అనంతపురం జిల్లా కేంద్రంలో పోలింగ్ సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అధికారులు అప్పగించారు. వారికి కేటాయించిన కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు. మూడో విడతలో భాగంగా అనంతపురం డివిజన్లోని 19 మండలాల్లో 379 పంచాయతీలు, 3736 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని ఒక మండలానికి ఎన్నికలు పూర్తవగా.. మిగిలిన నాలుగు మండలాలకు రేపు పోలింగ్ జరుగనుంది. 18 పంచాయతీలకు సంబంధించి ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందించేందుకు అధికారులు సిద్ధం చేశారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఇప్పటికే పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచారు. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించారు.
కడప జిల్లాలో..
రేపు జరగబోయే మూడో దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా జిల్లాలోని అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సామగ్రిని ఎన్నికల సిబ్బందికి ఆయా మండల అధికారులు అందజేశారు. నియోజకవర్గంలోని ఎన్నికల ఏర్పాట్లను సబ్ కలెక్టర్ కేతన్ పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛవాంచనీయ సంఘటనలు జరగకుండా.. చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రెండు నియోజకవర్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.