గ్రూప్ -1 మెయిన్స్ జవాబు పత్రాలను మాన్యువల్‌గానే మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 3నెలల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. డిజిటల్ మూల్యంకనాన్ని హైకోర్టు తప్పుపట్టలేదన్న ఆంజనేయులు..ముందే నోటిఫికేషన్‌లో చెప్పకపోవటాన్ని తప్పుపట్టిందన్నారు. కరోనా కారణంగానే డిజిటల్ మూల్యాంకనం చేశామని.. ఈ విధానం చాలా పారదర్శకంగా జరిగిందన్నారు.
మ్యానువల్ మూల్యాంకనంతో గ్రూప్-1 అభ్యర్థులు ఎవరికీ నష్టం ఉండదన్న ఆంజనేయులు..ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. భవిష్యత్తులోనూ డిజిటల్ మూల్యాంకనం కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు ఎంపిక కాకపోతే.. మూల్యాంకనాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. నియామకాల్లో ఏపీపీఎస్సీ చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. వయసు పెంపు సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో... నోటిఫికేషన్ జారీలో ఆలస్యమైందన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినందున త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామన్నారు.
త్వరలో గ్రూప్-1,గ్రూప్-2 నోటిఫికేషన్
190 అసిస్టెట్ ఇంజినీర్ ఉద్యోగాలకు వారంలో నోటిఫికేషన్ ఇస్తామన్న ఆంజనేయులు...త్వరలో 670 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులకు, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతోందన్న ఆయన..క్యాలెండర్ ఇస్తే పరీక్ష తేదీలు ఖరారు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకుంటామని ... తర్వాత పరీక్ష తేదీలు ప్రకటిస్తామన్నారు. ఖాళీల పోస్టులు వివరాలు ప్రభుత్వం నుంచి రావాలన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు పెరిగే అవకాశం ఉందని సీతారామాంజనేయులు తెలిపారు.
ఏం జరిగిందంటే?
గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో ఎనిమిది వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గ్రూప్-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. డిజిటల్ వాల్యూషన్ గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్ చేశారని, దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్ ఎలా చేయిస్తుందని వాదించారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషనర్ వాదించారు. ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్యూషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -1 ఇంటర్వ్యూతో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ..ఈ ఏడాది జూన్ 16 న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ధర్మాసనం ఎదుట ఏపీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది . మౌఖిక పరీక్షకు ఎంపికైన కొందరు అభ్యర్థులు కూడా అప్పీళ్లు వేశారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది. 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండి