‘రహదారుల నిర్వహణ పనులకు ప్రతి నెలా రూ.100 కోట్లు చెల్లించాలి’ అని సీఎం సెప్టెంబరులో ఆదేశించారు. అయినా...ఆ ప్రక్రియ జరగడం లేదు. ఫలితంగా పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. సీఎం ఆదేశించిన నెలలో మాత్రం గుత్తేదారులకు రూ.150 కోట్ల వరకు చెల్లించారు. అక్టోబరు నుంచి మళ్లీ ఆపేశారు. దీంతో ఈ సారి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు గుత్తేదారులు రావడం లేదు. ఇప్పటికే.. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రహదారులను మరమ్మతు చేసిన గుత్తేదారులకు రూ.388 కోట్లు, కేంద్ర రహదారి నిధి (సీఆర్‌ఎఫ్) కింద చేసిన పనులకు రూ.250 కోట్లు, క్యాపిటల్ వర్క్స్‌కు రూ.190 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించే వరకు పనులకు టెండర్లు వేసేది లేదని గుత్తేదారులు గతంలోనే తెగేసి చెప్పారు. ఇప్పుడు సీఎం ఆదేశాలూ అమలు కాకపోవడంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు 12 వేల కి.మీ. మేర రాష్ట్ర, జిల్లా రహదారులు దెబ్బతిన్నాయి. ఇందులో ఎన్‌డీబీ(న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్) రుణం, సీఆర్‌ఎఫ్, ఏపీఆర్‌డీసీ బ్యాంకు రుణంతో పునరుద్ధరించేవి పోగా.. ఇంకా 5 వేల కి.మీ.లలో మరమ్మతులు చేయాల్సి ఉంటుందని అంచనా. వీటికి నిధులు ఎప్పుడు ఇస్తారో.. మరమ్మతులు ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి.
ఏపీఆర్‌డీసీ కింద మళ్లీ టెండర్లు
ఏపీఆర్‌డీసీ బ్యాంకు రుణంతో చేపట్టే పనులకు టెండర్లు పిలిచినా ఇప్పటి వరకు గుత్తేదారులు అంతగా ఆసక్తి చూపలేదు. మొత్తం 1,147 పనులకుగాను 328 పనులకే బిడ్లు దాఖలయ్యాయి. ఇప్పుడు రూ.2వేల కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అంగీకరించింది. దీంతో మిగిలిన పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు.
ఇదీ చదవండి: