Nobel Peace Prize Laureate Kailash Satyarthi కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నా చదువుకు దూరమైన పిల్లలను మాత్రం పట్టించుకోవడం లేదని, సమాజం ముందుకెళ్తున్నా పిల్లల్ని వెనకే వదిలేస్తున్నామని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి ఆవేదన వ్యక్తంచేశారు. ఉచిత నిర్బంధ విద్యను 14 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నామని, రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలతో కలిసి ప్రభుత్వంతో చర్చిస్తున్నామని వెల్లడించారు. ఏపీ ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో సోమవారం ‘భవిష్యత్తు తరాల అభివృద్ధికి యువ నాయకత్వం’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అనంతరం విలేకర్లతోనూ మాట్లాడారు.
‘కొవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. 40శాతం మందికి ఎలక్ట్రానిక్ పరికరాలు లేక చదువులు అందలేదు. బాల్యవివాహాలు పెరిగాయి. బిహార్‌లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కారణంగా 4.5 కోట్ల మంది పిల్లలు కొత్తగా బాలకార్మికులుగా మారారు. దేశ జీడీపీలో 4శాతం మాత్రమే విద్యకు కేటాయిస్తున్నారు. విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు, ఉపాధ్యాయుల శిక్షణకు నిధులు పెంచాలి. ఎన్నో ఆందోళనల తర్వాత వచ్చిన విద్యాహక్కు చట్టం అమలులో మాత్రం సవాలుగానే మిగిలింది. దేశం వివిధ రంగాల్లో పురోగమిస్తున్నా.. పిల్లలపై వేధింపులు, అమ్మకాలు, బాల్యవివాహాలు ఆగడం లేదు.
75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఎంతో ప్రగతి సాధించాం. ఇదే పంథాలో బాలకార్మిక వ్యవస్థపైనా యువత పోరాడాలి. మహిళలను దుర్గా, సరస్వతిగా పూజించే దేశంలో బాలికలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. మహిళల అక్రమ రవాణా నిరోధక బిల్లు నాలుగేళ్లుగా పార్లమెంటుకు రాలేదు’ అని సత్యార్థి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్‌ఆర్‌ఎం ఉపకులపతి వజ్జా సాంబశివరావు, రిజిస్ట్రార్ ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: