YSRCP Sitting leaders Descendants : 2024 ఎన్నికల్లో వారసుల్ని బరిలోకి దించాలని చాలా మంది వైకాపా నేతలు ఎమ్మెల్యేలు ముందు నుంచే ప్రణాళికలు వేసుకున్నారు. కానీ, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన తాజా సమీక్షలో సీఎం జగన్ ఈసారికి వారసులొద్దంటూ వాళ్లకు షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్ని జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొత్త ముఖాలను బరిలోకి దింపి ప్రయోగాలు చేస్తే ఇబ్బందికర పరిస్థితులకు దారితీయొచ్చని వైకాపా నేతలు విశ్లేషిస్తున్నారు. పార్టీ శ్రేణులతో ప్రత్యక్ష సంబంధాలున్న సిట్టింగులనే బరిలోకి దించడం సమంజసంగా ఉంటుందని చెప్తున్నారు. వైకాపాకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐప్యాక్ సంస్థతోపాటు.. ఒకట్రెండు ఇతర సంస్థల ద్వారా చేయించిన సర్వేల ఆధారంగానే జగన్ ఈ నిర్ణయానికి వచ్చారంటున్నారు.
సర్వేల్లో వారసుల కంటే తండ్రుల్ని పోటీపైనే ప్రజల నుంచి ఎంతో కొంత సానుకూలత వచ్చిందని తెలుస్తోంది. వారసుల గ్రాఫ్ ఏ మాత్రం బాగాలేదని, వాళ్లకు టికెట్లు ఇస్తే కచ్చితంగా ఓడిపోతారని సర్వేల్లో వచ్చినట్లు సమాచారం. కొందరు వారసులు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోగా.. మరికొందరికి ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలతో అసలు సంబంధాలు లేకపోవడం సమస్యగా మారింది.
ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు ఒక్కసారికే సరిపెట్టుకుని, వారసుల్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఎందుకు తొందరపడుతున్నారనేది.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనుభవజ్ఞులకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని, అలాంటప్పుడు కొనసాగడం కంటే ఆగిపోవడం మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే వారసులను గెలిపించుకోగలిగితే వాళ్లు రాజకీయంగా స్థిరపడిపోతారనే ఆలోచనలో మరికొందరున్నట్లు ఇంకొందరి విశ్లేషణ.
ఇప్పటికే అనేక మంది వారసులు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు నడిపిస్తున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్య, స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి వెంకటనాగ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి, యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు కుమారుడు సుకుమార్ వర్మ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి వారి నియోజకవర్గ రాజకీయాల్లో వారు చురుగ్గా పాల్గొంటున్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ కుమారుడు నరేన్, ఎంపీ బోస్ కుమారుడు సూర్యప్రకాష్ చురుగ్గా తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుమారుడు పృథ్వీరాజ్.. మండపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల పరిధిలోని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తైతే మొదట్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి పల్లెబాట పేరుతో నియోజకవర్గ పరిధిలో ఆరు నెలల క్రితం.. విస్తృతంగా తిరిగారు. ఇంటి దగ్గర ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించిన సందర్భాలున్నాయి. ఇక ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇటీవలే ప్రకటించారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కుమారుడు తండ్రితో సంబంధం లేకుండానే సొంతంగానే నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
అధిష్ఠానం అనుమతిస్తే తన కుమారుణ్ని బరిలో నిలుపుతానని చక్రపాణిరెడ్డి గతంలో బహిరంగంగానే ప్రకటించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గంలో తన కుమారుడు తరుణ్‌రెడ్డి లేదా తన అన్న కుమారుడు ప్రతాప్‌రెడ్డిల్లో ఎవరికో ఒకరికి టికెట్ కావాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమా తండ్రితోపాటు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనురాధ, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు వంశీ రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
గతంలో చురుగ్గా ఉన్న కొందరు వారసులు ఇటీవల నెమ్మదించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహర్ నాయుడు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు నరసింహారెడ్డి లాంటివారు ఈ జాబితాలో ఉన్నారు. కరోనా సమయంలో విజయనగరం, చీపురుపల్లిల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు డాక్టర్ సందీప్ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తారన్న చర్చ జోరుగా సాగింది. అయితే సందీప్ రాజకీయ కార్యకలాపాల్లో ఎక్కడా కనిపించడం లేదు. వారసులకు టికెట్ లేదన్న జగన్ నిర్ణయం అందరికీ వస్తుందా? వయోభారం, మరికొందరు ఆరోగ్య కారణాలతో పోటీకి దూరం కావాలంటున్నవారికి మినహాయింపు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
ఇవీ చదవండి: