రైల్వే బడ్జెట్‌లోని మాయను బుధవారం లోక్‌సభలో కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ ఇచ్చిన సమాధానం బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టుల గురించి వైకాపా సభ్యుడు గోరంట్ల మాధవ్, తెదేపా సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రూ.24,365 కోట్ల అంచనా వ్యయంతో 1,917 కిలోమీటర్ల మేర 16 కొత్త లైన్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇవి విభిన్న దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇందులో 1997లో చేర్చిన మాచర్ల - నల్గొండ మార్గం నుంచి 2017 - 18లో చేర్చిన విజయవాడ - అమరావతి లైన్ వరకు ఉన్నాయి. అయితే ఇందులో తొమ్మిది ప్రాజెక్టులను వివిధ కారణాలతో రైల్వేశాఖ ఆపేసింది. వాటిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులే లేవు.
"రైల్వే లైన్ల నిర్మాణం పూర్తి కావడమన్నది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూసేకరణ చేపట్టడం, అటవీ అనుమతులు లభించడం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా మొత్తాన్ని జమ చేయడం, ఆయా మార్గాల్లో విద్యుత్తు లైన్లను మార్చడం, విభిన్న అధికార సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు లభించడంతోపాటు పనులు జరిగే ప్రాంతంలోని భౌగోళిక, వాతావరణ, శాంతిభద్రతల పరిస్థితులు ప్రధాన భూమిక పోషిస్తాయి. అందువల్ల ప్రాజెక్టుల పూర్తికి నిర్దిష్ట సమయం చెప్పలేం. అయినప్పటికీ వాటిని పూర్తి చేయడానికి రైల్వేశాఖ వేగంగా చర్యలు తీసుకుంటోంది’’ అని మాత్రమే చెప్పి ముగించారు. కానీ ఒక్కో ప్రాజెక్టు పరిస్థితిపై మంత్రి చెప్పిన సమాధానాన్ని పరిశీలిస్తే దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన 753 కిలోమీటర్ల నిర్మాణాన్ని పూర్తిగా నిలిపేశారు. భవిష్యత్తులో వీటిని చేపట్టే పరిస్థితి లేదు. ఇందులో....
- కాకినాడ - పిఠాపురం
- ఆట్టిపట్టు - పుత్తూరు
- గూడూరు - దుగరాజపట్నం
- కంభం - ప్రొద్దుటూరు
- కొండపల్లి - కొత్తగూడెం
- చిక్కబళ్లాపుర - శ్రీసత్యసాయిప్రశాంతి నిలయం
- శ్రీనివాసపుర - మదనపల్లి
- విజయవాడ - అమరావతి
- మాచర్ల - నల్గొండ లైన్లు ఉన్నాయి.
వీటికయ్యే వ్యయాన్ని పంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపకపోవడం, ఒకవేళ చూపినా లాభదాయకం కాకపోవడంతో పూర్తిగా నిలిపేశారు. ఇక మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణ వేగం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే వాటా, భూసేకరణ వేగంపైనే ఆధారపడి ఉంటుందని కేంద్రమంత్రే తన సమాధానంలో విస్పష్టంగా చెప్పారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని 16 కొత్త రైల్వే లైన్లన్నీ మేడిపండులానే కనిస్తున్నాయి.
రాష్ట్రానికి ప్రకటించిన 16 లైన్ల పరిస్థితి.. కేంద్ర మంత్రి మాటల్లో..
1) కోటిపల్లి - నర్సాపురం (57 కి.మీ): ఈ ప్రాజెక్టు వ్యయంలో ఏపీ ప్రభుత్వం 25% పంచుకోవాలి. 2000-01 బడ్జెట్‌లో దీన్ని చేర్చాం. రూ.2,120 కోట్ల వ్యయమయ్యే ఈ మార్గంపై 2020 మార్చి వరకు రూ.663 కోట్లు ఖర్చుచేశాం. 2020-21లో రూ.551 కోట్లు కేటాయించాం. మొత్తం 369 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా 163 హెక్టార్లు సేకరించారు. ఏపీ ప్రభుత్వం మిగిలిన 206 హెక్టార్ల భూమిని సేకరించి ఇవ్వడంతోపాటు, తనవాటా కింద ఇవ్వాల్సిన రూ.309 కోట్లను వెంటనే జమచేయాలి. ఈ మార్గంలో మూడు ముఖ్యమైన వంతెనల పనులు ప్రారంభమయ్యాయి.
2) కాకినాడ - పిఠాపురం (22 కి.మీ): ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్ ప్రకారం ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ సాధ్యంకాదని, సామర్లకోట మార్గం ఇప్పటికే అందుబాటులో ఉన్నందున దీన్ని నిలిపేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.
3) దిండివనం - నగరి (184 కి.మీ): రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుపై గత ఏడాది మార్చి వరకు రూ.239 కోట్లు ఖర్చుచేశాం. ఇందుకు తమిళనాడు ప్రభుత్వం ఇంకా 709 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 హెక్టార్ల భూమి సేకరించి ఇవ్వాల్సి ఉంది.
4) రాయదుర్గం - తుమకూరు వయా కల్యాణదుర్గం (207 కి.మీ): రూ.2,398 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ మార్గంపై గత మార్చి వరకు రూ.983 కోట్లు ఖర్చుచేశాం. 2020-21లో రూ.170 కోట్లు కేటాయించాం. ప్రాజెక్టు వ్యయంలో సగం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు పంచుకోవాల్సి ఉంది. కర్ణాటక ఇంకా 273 హెక్టార్ల భూమి, రూ.68 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 34 హెక్టార్ల భూమి, రూ.39 కోట్లు సమకూర్చాల్సి ఉంది. ఈ మార్గంలో ఇప్పటివరకు రాయదుర్గం-కదిరిదేవరపల్లి మధ్య 63 కిలోమీటర్ల లైన్ పూర్తయింది. మిగిలినచోట్ల భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పనులు ప్రారంభించాం. భూసేకరణ, రాష్ట్ర ప్రభుత్వాల వాటా సమకూర్చడంపైనే ఈ ప్రాజెక్టు పూర్తికావడం ఆధారపడి ఉంటుంది.
5) కడప - బెంగుళూరు (268 కి.మీ): రూ.3,038 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో 50% ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంది. గత మార్చివరకు కేంద్రం రూ.351 కోట్లు ఖర్చుపెట్టింది. ప్రాజెక్టు పూర్తికావాలంటే ఏపీ ప్రభుత్వం 1,084 హెక్టార్ల రెవిన్యూభూమి, 56.06 హెక్టార్ల అటవీభూమి, 50% నిధులు సమకూర్చాలి. కర్ణాటక కూడా 336 హెక్టార్ల రెవిన్యూ భూమి అందించాల్సి ఉంది. ఇప్పటివరకు కడప-పెండ్లిమర్రి మధ్య 21.3 కిలోమీటర్ల లైన్ పూర్తయింది. మిగతా పనులన్నీ ఆంధ్రప్రభుత్వం అందించే భూమి, నిధులపైనే ఆధారపడి ఉంటుంది.
6) అట్టిపట్టు - పుత్తూరు (88 కి.మీ): రూ.1,105 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో 50% వాటాను ఎన్నూర్‌పోర్ట్ ట్రస్ట్ సమకూర్చాల్సి ఉంది. అయితే తాము ఆ మొత్తాన్ని ఇవ్వలేమని పోర్ట్ ట్రస్ట్ చెప్పింది.7) నడికుడి-శ్రీకాళహస్తి (309 కి.మీ): రూ.2,643 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో 50% ఏపీ ప్రభుత్వం భరించాలి. గత మార్చివరకు రైల్వేశాఖ రూ.1,051 కోట్లు ఖర్చుచేసింది. 2020-21 బడ్జెట్‌లో రూ.1,198 కోట్లు కేటాయించింది. ఏపీ ప్రభుత్వం 991 హెక్టార్ల రెవిన్యూభూమి, 119 హెక్టార్ల అటవీభూమి, తన వాటా కింద రూ.1,262.68 కోట్లు అందించాల్సి ఉంది. ప్రస్తుతం న్యూపిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులు పూర్తికావడం అన్నది ఏపీ ప్రభుత్వ చర్యలపై ఆధారపడి ఉంటుంది.
8) గూడూరు - దుగరాజపట్నం (42 కి.మీ): రూ.761 కోట్ల ఈ ప్రాజెక్టులో రేట్ ఆఫ్ రిటర్న్స్ -8.23%(లోటు) ఉంటుందన్న ఉద్దేశంతో గత ప్రణాళికాసంఘం దీనికి అనుమతి ఇవ్వలేదు. అయితే ఈ ప్రాజెక్టుద్వారా పోర్టు అనుసంధానం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో పీపీపీ కింద చేపట్టడానికి 2017లో నౌకాయానశాఖను సంప్రదించాం. కానీ వారినుంచి స్పందన రాలేదు. లాభదాయకం కాదన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును నిలిపేశాం.9) మారికుప్పం-కుప్పం (24 కి.మీ): రూ.280 కోట్ల ప్రాజెక్టుపై గత మార్చి వరకు రూ.32 కోట్లు ఖర్చయింది. భారత్ గోల్డ్‌మైన్స్‌కి చెందిన 49.71 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. అలాగే ఏపీ ప్రభుత్వం 246 ఎకరాల రెవిన్యూ భూమి అందించాల్సి ఉంది.
10) భద్రాచలం - కొవ్వూరు (119 కి.మీ): రూ.2,155 కోట్ల ఖర్చుకాగల ఈ ప్రాజెక్టు వ్యయంలో 50% పంచుకుంటామని తెలపాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరాం. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 50% ఖర్చు భరించడానికి అంగీకరించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం తెలిసిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి అంచనాలు తయారుచేస్తాం.
11) కంభం - ప్రొద్దుటూరు (142 కి.మీ): రూ.1,599 కోట్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టు వ్యయంలో 50% పంచుకోవాలని ఏపీని కోరితే వారు 13% వాటా, ఉచితంగా భూమి ఇవ్వడానికి మాత్రమే అంగీకరించారు. అందువల్ల ఇది లాభదాయకం కాదని ఆపేశాం.
12) కొండపల్లి - కొత్తగూడెం (82 కి.మీ): రూ.997 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో కేవలం 13% పంచుకోవడానికే ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది. అందువల్ల ప్రాజెక్టును నిలిపేశాం.13) చిక్కబళ్లాపుర-పుట్టపర్తి-శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం (103 కి.మీ): రూ.692 కోట్ల ఈ ప్రాజెక్టుకు గత ప్రణాళికాసంఘం అనుమతివ్వలేదు. అందువల్ల దీన్ని చేపట్టలేదు.
14) శ్రీనివాసపుర - మదనపల్లి (75 కి.మీ): దీనికి కర్ణాటక ప్రభుత్వం 50% నిధులు సమకూర్చినా లాభదాయకంగా నడిచే పరిస్థితి లేదు. అందువల్ల ప్రాజెక్టును నిలిపేశాం.
15) విజయవాడ - గుంటూరు వయా అమరావతి (107 కి.మీ): రూ.1,732.56 కోట్లు కాగల ప్రాజెక్టు వ్యయంలో ఎంతోకొంత రాష్ట్ర ప్రభుత్వం పంచుకొనేలా చూడాలని నీతిఆయోగ్ సూచించింది. అయితే ఏపీ ప్రభుత్వం అందుకు సుముఖత వ్యక్తంచేయలేదు. అందువల్ల ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు.
16) మాచర్ల - నల్గొండ (92 కి.మీ): రాష్ట్రప్రభుత్వం ఉచితంగా భూమి, 75% వాటా భరించినప్పటికీ ఈ ప్రాజెక్టు లాభదాయకం కాదు.
ఇదీ చదవండి: