రాష్ట్రవ్యాప్తంగా 257 ప్రాజెక్టుల పరిధిలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో 30,16,000 మంది చిన్నారులు, బాలింతలు, గర్భిణులు లబ్ధి పొందుతున్నారు. ఈ కేంద్రాలన్నింటికీ కలిపి 1.10 కోట్ల లీటర్ల పాలు అవసరం. దీని కోసం ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. కర్ణాటకలోని నందినీ డెయిరీకి లీటరుకు రూ.47.25 ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. పాలు ఆరు నెలలు నిల్వ ఉండే టెట్రా ప్యాక్‌లు ప్రతి నెలాఖరుకు రావాలి. కానీ ఇవి పది రోజులు ఆలస్యంగా వస్తున్నాయి. టెట్రాప్యాక్‌లను ప్యాకింగ్ చేసే అట్టపెట్టెల ముడిసరకు ధర కిలో రూ.8 నుంచి రూ.15కు పెరిగింది. వేసవి కావడంతో పాలసేకరణ ధరను పెంచారు. అందువల్ల లీటరుకు రూ.5 అయినా పెంచాలని నందినీ డెయిరీ అడిగినా.. రాష్ట్ర ఆర్థికపరిస్థితి దృష్ట్యా పెంచలేమన్నారు. దాంతో పాలు ఆలస్యమైనా అడగలేని పరిస్థితి నెలకొంది.
* రాష్ట్రంలో రోజుకు 4 లక్షల లీటర్ల పాలు వచ్చేవి. ఇప్పుడు 2.5-3 లక్షల లీటర్లే వస్తున్నాయి. దీంతో అంగన్‌వాడీలకు పాల సరఫరాపై ప్రభావం పడింది.
* కృష్ణాజిల్లాలో ఈ నెలలో 7 లక్షల లీటర్ల పాలు అవసరం. ఇప్పటి వరకు 2.2 లక్షల లీటర్లే వచ్చాయి.
* గుంటూరు జిల్లాలో చాలా కేంద్రాలకు పాల పంపిణీ ఆలస్యమవుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పలు కేంద్రాలకు అసలు పాలు రాలేదు. సత్తెనపల్లి పట్టణంలో గత నెలలో టెట్రా ప్యాక్‌లకు బదులు సాధారణ ప్యాకెట్లు వచ్చాయి. అంగన్‌వాడీ పర్యవేక్షకులు వీటిని తీసుకోవడానికి అంగీకరించక తిప్పిపంపారు.
ఇదీ చదవండీ... జగనన్న విద్యాదీవెన: మొదటి విడత కార్యక్రమం నేడు ప్రారంభం