No crop holiday: రాష్ట్రంలో ఎక్కడా పంట విరామం లేదని, గోదావరి, కృష్ణా డెల్టాలకు ముందుగానే నీరు విడుదల చేయడంతో సాగు పనులు మొదలయ్యాయని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. 2022-23 సీజన్‌లో రైతులు మూడు పంటలు వేస్తారని తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆమె, వ్యవసాయశాఖ కమిషనర్ హరికిరణ్‌తో కలిసి సమావేశంలో మాట్లాడారు.
2021 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతుల్లో ఇంకా బీమా పరిహారం అందకపోయినా, జాబితాలో పేర్కొన్న వివరాల్లో తేడాలున్నా.. 15 రోజుల్లో ఆర్బీకేలు, గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని, 155256 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. వీటిని పరిశీలించి పరిహారం అందించేలా ఏర్పాటు చేశామన్నారు. పరిహారం చెల్లింపులో పారదర్శకత పాటించామని, ఈసారి 26 పంటలు నష్టపోయిన రైతులకు మేలు కలిగేలా చూశామని తెలిపారు.
రాష్ట్రంలో రుణ ఎగవేత (ఎన్‌పీఏ) రైతుల సంఖ్య తగ్గుతున్నట్లు ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో బ్యాంకర్లు తెలియజేశారన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, రైతు భరోసా, పంటనష్టపోయిన వారికి బీమా పరిహారం ఇచ్చి ప్రభుత్వం దన్నుగా ఉంటోందని చెప్పారు. ఇంత మేలుచేస్తుంటే రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఎందుకు ఉందని విలేకరులు ప్రశ్నించగా.. ఇక్కడ నమోదు ప్రక్రియ పక్కాగా ఉందని, మారుమూలన ఘటన జరిగినా సరే ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలించి వివరాలు నమోదు చేస్తోందని పూనం మాలకొండయ్య తెలిపారు.
రైతుల్లో ఆందోళన నిజమే.. కోనసీమ జిల్లాలో కొన్ని చోట్ల డ్రెయిన్ల ఆధునికీకరణ జరుగుతోందని కమిషనర్ హరికిరణ్ తెలిపారు. మరికొన్నిచోట్ల గుర్రపు డెక్క తొలగించకపోవడం, సముద్రం నుంచి ఉప్పునీరు రావడం వంటి సమస్యలు ఉన్నది వాస్తవమేనన్నారు.
చివరి ఆయకట్టు వరకు నీరు చేరదనే ఉద్దేశంతో కొందరు రైతులు ఆందోళనగా ఉంటే, వారితో కలెక్టర్, అధికారులు మాట్లాడి తప్పకుండా నీరందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తుపాన్లతో పంటలు నష్టపోకుండా ఈసారి ముందుగానే డెల్టాలకు నీటిని విడుదల చేశామన్నారు.
ఇవీ చూడండి: