వైకాపా అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు నాలుగు ఉపద్రవాలు కల్పించారని... టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రివర్స్ టెండరింగ్ పేరుతో తొలి ఉపద్రవాన్ని సృష్టించి రూ.750 కోట్లు ఆదా చేస్తున్నామని ప్రజలకు అబద్ధాలు చెప్పి.. రూ.7,500 కోట్ల వరకు నష్టం కలిగించారని మండిపడ్డారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో హైడల్ ప్రాజెక్ట్ పనులు 28 నెలలు ఆలస్యమయ్యేలా జగన్ ప్రభుత్వం స్వార్థపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాష్ట్రం 15,484 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టంప్రకారం నిర్వాసితులకు, పునరావాసం కింద ఖర్చు పెరిగిందని చెప్పినా వినకుండా తెదేపా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి యత్నిస్తున్నారని విమర్శించారు.
వైకాపా ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును తగ్గించడానికి సిద్ధమవడం మూడో ఉపద్రవమని నిమ్మల అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ ఎత్తుని 150 అడుగుల నుంచి 135 అడుగులకు కుదించాలనే నిర్ణయం వల్ల ప్రాజెక్ట్ నిర్మాణమే ప్రశ్నార్థకమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నాణ్యతను విస్మరించి, అనామక కంపెనీకి పనులు అప్పగించడం ద్వారా... గోదావరి జిల్లాలను నామరూపాలు లేకుండా చేయడానికి జగన్ సంకల్పించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి:
ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ.. ఎన్నికల కమిషనర్‌కు.. సీఎస్ లేఖ