కేంద్ర ప్రభుత్వం 2020 ఏడాదికి... 20 మంది రచయితలకు సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించింది. తెలుగులో.. ప్రముఖ దిగంబర కవి నిఖిలేశ్వర్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అగ్నిశ్వాస కవితా సంపుటికి ఈ అరుదైన పురస్కారం లభించింది. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదగిరిరెడ్డి. నిఖిలేశ్వర్ కలం పేరు. ఆయన దిగంబర కవుల్లో ఒకరిగా పేరుపొందారు.
నిఖిలేశ్వర్ కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల అనేక రచనలు చేశారు. 1956 నుంచి 1964 వరకు తన అసలు పేరు మీదే రచనలు చేశారు. 1965 నుంచి తన కలం పేరుని నిఖిలేశ్వర్గా మార్చుకుని దిగంబర విప్లవ కవిగా ప్రసిద్ధిగాంచారు. ఆయన 11 ఆగస్టు, 1938న యాదాద్రి భువనగిరి జిల్లా వీరవల్లిలో జన్మించారు. గతంలో అనేక అవార్డులు సైతం ఆయన అందుకున్నారు.
దిగంబర కవిత్వం 1960-70 వరకు మూడు సంపుటాలుగా వెలువడింది. నిఖిలేశ్వర్ కవి, కథకుడు, అనువాదకుడు, విమర్శకుడిగా సేవలందించారు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా సైతం పనిచేశారు.
వర్ధమాన తెలుగు రచయిత్రి ఏపీ నెల్లూరుకు చెందిన ఎండ్లూరి మానసకు సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కింది. మానస రచించిన 'మిలింద' లఘు కథల సంపుటికి అవార్డు ప్రకటించారు. ఈమె తెలుగు రచయితలైన ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలతలకు జన్మించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రంలో పీజీ చేశారు.
కన్నెగంటి అనసూయకు బాలసాహితీ పురస్కారం వరించింది. ఆమె రచించిన 'స్నేహితులు' లఘు కథల సంపుటికి పురస్కారం లభించింది.
ఇదీ చూడండి :