New Year Resolutions 2022: వెంటనే ఆచరణలో పెట్టని ఆలోచనలు.. ఆశయాలుగానే మిగిలిపోతాయి. తిరిగి తీసుకోవడానికి నిన్న మనది కాదు. కానీ రేపన్నది మనదే.. గెలిచినా, ఓడినా...
శిలవూ నీవే.. శిల్పివీ నీవే..
గతం ఓ సింహావలోకనం..
పాఠాలు నేర్చుకుందాం..
పాత పంథాను వదిలేద్దాం..
కొత్త ఆశలకు మోసులెత్తుదాం.
కరోనాలు కత్తులు దూసినా..
నియమాలతో తిప్పికొడదాం..
పసిడి పంట పండాలన్నా...
చక్కటి ఉద్యోగం పొందాలన్నా...
సామాన్యులు సంపన్నులు కావాలన్నా...
ఓ కుర్రాడు క్రీడారత్నం కావాలన్నా.. ఒకటేమిటి..
ఏం చేయాలనుకున్నా..
కృషితో నాస్తి దుర్భిక్షం..
నిస్పృహ వద్దు...
కార్యాచరణే దానికి విరుగుడు..
ఇష్టంగా శ్రమిద్దాం...
విజయ బావుటా ఎగరేద్దాం..
సానుకూలతే సోపానం..
ముందున్నది మంచికాలం..
అను‘బందీ’లవ్వండి
నిన్నటి నుంచి నేర్చుకో నేటి కోసం జీవించు రేపటి కోసం కలలు కను
- ఐన్‌స్టీన్
‘వ్యక్తిగతం’ స్థానంలో ‘కుటుంబం’ను ప్రవేశపెడదాం. కుటుంబ సభ్యులందరం పరస్పరం స్ఫూర్తి నింపుకొంటూ ముందుకెళ్లేలా.. అనుబంధాలను మరింత పదిలం చేసుకునేలా సాగుదాం. కుటుంబమంతటికీ ప్రయోజనం చేకూర్చే తీర్మానాలు చేసుకుందాం! వీలైతే.. ఇదిగో ఇలాంటివి ప్రయత్నించండి..
ఈ తీర్మానాలూ ప్రయత్నించండి..
- మద్యం తాగి వాహనం నడపక పోవడం
- వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకపోవడం
- ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, ఇతర కూరగాయల శాతాన్ని పెంచుకోవడం
- కనీసం నెలకొక పుస్తకం చదవడం. అందులోని అంశాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం
కలిసి శ్రమించండి
శరీరమనే బండికి వ్యాయామం సర్వీసింగ్ లాంటిది. వారంలో కనీసం 3-4 రోజులు వ్యాయామం చేస్తే మంచిది! వ్యాయామం అంటే- నడక, పరుగు వంటివే చేయాలని.. బూట్లు, ట్రాక్ పాయింట్లు వేసుకొని పార్కులకో మైదానాలకో వెళ్లాలని గిరి గీసుకోవద్దు. అవసరమైతే ఇంట్లోనే నడవండి. వాషింగ్ మెషీన్‌కు విశ్రాంతినిచ్చి మీరే దుస్తులు ఉతకండి. తోటపని.. బ్యాడ్మింటన్, క్రికెట్ వంటివీ వ్యాయామం కోటాలోనివే! ఇష్టపడి చేయండి. కుటుంబ సభ్యులంతా కలిసి శారీరకంగా శ్రమించండి. ఫలితంగా అటు ఆరోగ్యం.. ఇటు అనుబంధం రెండూ పెరుగుతాయి.
వారంలో ఒక్కరోజైనా..
ఇప్పుడున్న ఉరుకులు పరుగుల ప్రపంచంలో కుటుంబసభ్యులతో కలిసి ఉండటానికి దొరికే సమయం తక్కువ. ఆ కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సెల్‌ఫోన్‌ను వారంలో ఒక్కరోజైనా పక్కన పెట్టండి. అందరితో ఆనందంగా గడపండి. అంతా కలిసి కూర్చొని తినండి. వీలు చిక్కితే విహార యాత్రలకు వెళ్లండి.
ఆర్థిక బాధ్యత తీసుకోండి
జీవనవ్యయాలు పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ప్రణాళికలు అత్యవసరం. కుటుంబసభ్యులంతా కలిసి కూర్చొని ఆలోచించండి. కుటుంబపెద్దపై భారాన్ని తగ్గించండి. అది మీ బాధ్యతని గుర్తించండి.
ఓటమి సమీపించకుండా ఉండాలంటే.. గెలవాలన్న తపన ఎప్పటికీ తగ్గకూడదు.
మనం ఏదైనా గొప్పపని చేయడానికి సరైన మార్గం... ముందుగా దాన్ని ప్రేమించడం.
- స్టీవ్ జాబ్స్
ఇదీ చూడండి: Attack on Tailor: డ్రెస్ సరిగా కుట్టలేదని.. ఎంత పని చేశారంటే..!