గత ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన చివరి విడత జేఈఈ మెయిన్‌ను వాయిదా వేసి సెప్టెంబరు2 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించారు. అందులో అర్హత సాధించిన విద్యార్థులకు అదే నెల 27న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి అంత ఆలస్యమయ్యే పరిస్థితులు లేనందున రెండు సార్లు జరపాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు ఎనిమిది లక్షల మందికిపైగా హాజరయ్యే అవకాశముంది.
త్వరగా పూర్తి చేస్తే శ్రేయస్కరం
సెప్టెంబరులో కరోనా మూడో వేవ్ వస్తుందన్న అంచనాలున్నందున ఆలోపు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలను పూర్తిచేయాలని కొందరు నిపుణుల సూచిస్తున్నారు. ‘ఎన్‌ఐటీల్లో బీఆర్క్ కోర్సుల్లో చేరేందుకు జేఈఈ మెయిన్‌లోనే పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులకు జనవరిలో పరీక్ష జరిపి మళ్లీ నాలుగో విడత(చివరి)లో నిర్వహిస్తామని, రెండు, మూడు విడతల్లో పేపర్-2 ఉండదని చెప్పారు. ఇప్పుడు మూడు, నాలుగో విడతల్లో ఒకసారే పరీక్ష నిర్వహించి అందులో వారికి అవకాశం ఇవ్వొచ్చు’ అని నానో అకాడమీ సంచాలకుడు కాసులు కృష్ణ చైతన్య సూచిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పాసైన వారు ఐఐటీల్లో బీఆర్క్ కోర్సుల్లో చేరాలంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెసు రాయాలి. అంటే మూడో వేవ్ వస్తే ఆ పరీక్ష జరపడం సమస్య అవుతుందని, జులై, ఆగస్టులో పరీక్షలను పూర్తి చేయడం అన్ని విధాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
పరీక్ష తేదీల కోసం ఎదురుచూపులు
పరీక్షల తేదీలు వెల్లడించడంపై దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. జాతీయస్థాయి పరీక్ష అయిన కామన్ లా అడ్మిషన్ టెస్టు(క్లాట్)ను జులై 23న నిర్వహిస్తామని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్షియం గత నెలలోనే ప్రకటించింది. ఈక్రమంలో జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలను ఎప్పుడు వెల్లడిస్తారోనని ఎదురుచూస్తున్నారు. నీట్‌ను ఆగస్టు 1న జరుపుతామని గతంలోనే ప్రకటించిన కేంద్రం ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: