పురపాలికల్లో సీట్ల కోసం పోరు జోరుగాసాగుతోంది. తమ అనుచరులకు అవకాశం కోసం నేతలు తహతహలాడుతున్నారు. ఇప్పటివరకు కొన్ని మున్సిపాలిటీల్లో సీట్ల పంపకాలు, సర్దుబాట్లు జరిగాయని వైకాపాలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఆయా పురపాలికల్లోని నాయకులు పార్టీ అధిష్ఠానంపై తెచ్చే ఒత్తిడిని బట్టి ఈ సీట్ల పంపకాల్లో మార్పుచేర్పులుండవచ్చని అంటున్నారు. మొత్తంగా నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాకే స్పష్టత వస్తుందని విశ్లేషిస్తున్నారు.
నగరపాలక సంస్థలు
చిత్తూరు: మొత్తం 50డివిజన్లలో స్థానిక ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు 27, మిగిలిన వాటిలో పార్టీ నేతలు బుల్లెట్ సురేష్, విజయానందరెడ్డికి కలిపి 16, చంద్రశేఖర్‌కు 5, పురుషోత్తంరెడ్డికి ఒకవార్డు అప్పగించారని అంటున్నారు. మరొకరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విన్నవించి నామినేషన్ వేశారని సమాచారం.
కర్నూలు: 52 డివిజన్లలో 33 కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పరిధిలో ఉండగా వీటిలో 17 డివిజన్లను తనకు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పట్టుబడుతున్నారు. వీరిద్దరి మధ్య సయోధ్యకు వైకాపా పెద్దల ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 16 డివిజన్ల అభ్యర్థులను అక్కడి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఎంపిక చేసుకున్నారు. కోడుమూరు నియోజకవర్గంలోకి వచ్చే 3 డివిజన్ల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అక్కడి ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు అప్పగించారు.
కడప: మొత్తం 50డివిజన్లకుగాను పాతకడపలోని డివిజన్లను స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, చిన్నచౌక్ పరిధిలోని డివిజన్లను మాజీ మేయర్ సురేష్, కమలాపురం నియోజకవర్గం నుంచి కడపలో విలీనమైన ప్రాంతంతోపాటు మరికొన్ని డివిజన్లను ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి అప్పగించారు.
పురపాలికల్లో...
నందికొట్కూరు: మొత్తం 29 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్‌కు 14, ఆ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డికి 15 చొప్పున వైకాపా అధినాయకత్వం సర్దుబాటు చేసినట్లు సమాచారం. అయితే ఇరువర్గాలనుంచి రెబల్స్ నామపత్రాలను వేసే పరిస్థితి అక్కడుంది. ఉపసంహరణ పూర్తయితే కానీ ఎవరికి ఎన్ని సీట్లనేది స్పష్టత రాదు.
నగరి: మొత్తం 29వార్డులో ఇక్కడి ఎమ్మెల్యే రోజాకు 19వార్డులు, కేజేకుమార్-శాంతి దంపతులకు 10వార్డులు కేటాయించారని అంటున్నారు. శాంతికి ఇటీవల ఈడిగ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పదవినిచ్చారు. దీంతో వారి వర్గీయులతో నామినేషన్లను ఉపసంహరింపజేస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
బద్వేలు: వైకాపా సమన్వయకర్త, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అభ్యర్థులను ఎంపిక చేశారని తెలిసింది. ఇక్కడ వైకాపాకు రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. ఈ పార్టీ నుంచి మొత్తం 90 నామినేషన్లు దాఖలైనట్లు చెబుతున్నారు.
రామచంద్రపురం: 28వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఇంతకుముందు ఈ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా వ్యవహరించిన తోట త్రిమూర్తులకు సగం చొప్పున వార్డులను సర్దుబాటు చేశారు. ఇది గతేడాది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి పరిస్థితి. తర్వాత త్రిమూర్తులుకు మండపేట నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు రామచంద్రపురంలో ఆయన వర్గీయులు కొనసాగుతారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
యలమంచిలి: 25వార్డులకుగాను ఎమ్మెల్యే రమణమూర్తిరాజు 21వార్డులు, వైకాపా నాయకుడు అడారి ఆనంద్ వర్గానికి 4 కేటాయించారు. ప్రస్తుతం వీరిమధ్య అంతరం రావడంతో సీట్ల పంపకాలపై సందిగ్ధత నెలకొంది.
చీరాల: 33వార్డులకుగాను వైకాకు మద్దతిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ ప్రతి వార్డులోనూ వారి మద్దతుదారులు ఇద్దరిద్దరి చొప్పున నామినేషన్లు వేయించారని తెలిసింది. ఈ పార్టీ నుంచే 230 నామినేషన్లు దాఖలయ్యాయంటే ఇద్దరు నేతల మధ్య పోటీ స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: