తెలంగాణ భద్రాద్రి ఆలయంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో మొదటిది సీతారాముల కల్యాణం కాగా... రెండోది ముక్కోటి ఏకాదశి వేడుకలు. నేటి నుంచి జనవరి 4 వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు పగలు ఉత్సవాలు... ఈ నెల 25 నుంచి జనవరి 4 వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 5 నుంచి జనవరి 7 వరకు విలాసోత్సవాలు జరగనున్నాయి. జనవరి 10న స్వామివారికి విశ్వరూప సేవ జరపనుంది. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 23 వరకు భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ నెల 24న స్వామివారికి చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. 25న ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే శ్రీరామచంద్రమూర్తి ప్రతిరోజు ప్రధాన ఆలయం నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చిత్రకూట మండపం వద్దకు వచ్చి... అక్కడ వేచి ఉన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా భద్రాద్రిని ఆలయ అధికారులు అందంగా ముస్తాబు చేశారు. ప్రధాన రహదారుల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆలయానికి రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు. ఆలయాన్ని కొంగొత్త రంగులతో తీర్చిదిద్దారు.
ఉత్తర ద్వార దర్శనం రోజు కేవలం కొంతమంది వీఐపీలకు మాత్రమే అనుమతి ఉందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులంతా ఉత్తర ద్వారం నుంచి వచ్చి ప్రధాన ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవచ్చని పేర్కొన్నారు.