సీఐడీ పోలీసు కస్టడీలో ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు గాయాలవడంపై హైకోర్టు మండిపడింది. పోలీసు కస్టడీలో ఉన్నవారిని ఎలా కొడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ శరీరంపై ఉన్నవి పోలీసు దెబ్బల వల్ల అయిన గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించింది. దీనిపై నివేదిక ఇచ్చేందుకు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, సూపరింటెండెంట్ నామినేట్ చేసిన మరొక వైద్యుడు సభ్యులుగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఎంపీని మెడికల్ బోర్డు వద్ద ఉంచాలని సీఐడీని ఆదేశించింది. తక్షణం పరీక్ష నిర్వహించి నివేదిక సమర్పించాలని బోర్డుకు స్పష్టం చేసింది.
వీడియో చిత్రీకరణ చేయండి..
ఎంపీని పరీక్షించే సమయంలో వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించింది. చిత్రీకరణ వీడియోను, వివరాల్ని సీల్డ్ కవర్లో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)కి అప్పగించాలంది. గుంటూరు మెజిస్ట్రేట్ ఎంపీ వాంగ్మూలాన్ని రికార్డు చేసి ఉంటే దాన్ని కూడా సీల్డ్ కవర్లో పీడీజేకు అందజేయాలని ఆదేశించింది. వాటిని హైకోర్టు వెకేషన్ అధికారి ఎం.నాగేశ్వరరావుకు పంపాలని పీడీజేకు స్పష్టం చేసింది. అవసరమైతే ఆసుపత్రిలో ఎంపీకి చికిత్స అందించాలన్న న్యాయవాది అభ్యర్థనపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని, దీనిపై నిర్ణయాన్ని మెడికల్ బోర్డుకు వదిలేస్తున్నట్లు పేర్కొంది. ఎంపీని పరీక్షించే సమయంలో కుటుంబసభ్యులు, కుటుంబ వైద్యుడ్ని అనుమతించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఎంపీతో అనుమతించాలన్న విజ్ఞప్తినీ తిరస్కరించింది. ఒకవేళ ఎంపీ ఆసుపత్రిలో చేరితే రాష్ట్ర పోలీసులే భద్రత కల్పించాలని తేల్చిచెప్పింది. విచారణను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం శనివారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ పోలీసు కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజును గుంటూరులోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లగా ఆయన శరీరంపై గాయాలున్న సంగతి వెలుగు చూసింది. పోలీసులు తనను కొట్టారని ఎంపీ మెజిస్ట్రేట్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంపీని కొట్టిన సంగతి, కమిలిపోయిన గాయాలకు సంబంధించిన ఫొటోలను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళుతూ ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు హైకోర్టుకు లేఖ రాశారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం శనివారం సాయంత్రం అత్యవసరంగా విచారణ జరిపింది.
సీబీఐతో దర్యాప్తు చేయాలి
‘ఎంపీని రిమాండ్‌కు పంపడానికి మెజిస్ట్రేట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో హాజరుపరిచేలా ఆదేశించండి. ఎంపీకి భద్రత లేదు. ఆయన్ను హతమార్చే అవకాశం ఉంది. ఎంపీ గాయాల్ని పరిశీలించడానికి ప్రభుత్వానికి చెందిన ఒక్క డాక్టర్‌ను నియమిస్తే విశ్వసించలేం. మెడికల్ బోర్డును ఏర్పాటు చేయండి. వైద్యపరీక్షల సమయంలో న్యాయవాదుల సమక్షంలో వీడియో తీయించండి. ఆ సమయంలో కుటుంబసభ్యుల్ని, కుటుంబ వైద్యుడ్ని అనుమతించండి. ఆసుపత్రిలో ఉండగా సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించండి. ఎంపీని గాయపరిచిన వ్యవహారాన్ని ఇప్పటికే పార్లమెంట్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్‌ఐఏ, సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థలతో ఈ విషయంపై దర్యాప్తు చేయాలి’ అని న్యాయవాది కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. రాష్ట్రంలో ఏం జరుగుతోందని అదనపు ఏజీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది.
గాయాల్లేవు.. కొట్టినట్లు కథ అల్లారు: ఏఏజీ
ఎంపీ న్యాయవాది వాదనలను అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తోసిపుచ్చారు. బెయిలు పిటిషన్ కొట్టేసే వరకు ఎంపీ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదన్నారు. వైద్యుడు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ఆయన శరీరంపై గాయాల్లేవని స్పష్టం చేస్తోందన్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొచ్చాక పోలీసులు కొట్టినట్లు కథ అల్లారన్నారు. మెడికల్ బోర్డు ద్వారా పరిశీలన చేయిస్తామంటే తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో పరిశీలన వద్దన్నారు.
రిమాండ్ దరఖాస్తు ఏమైంది: ధర్మాసనం
గుంటూరులో ఎంపీని హాజరుపరచడానికి మెజిస్ట్రేట్ ముందు ఉంచిన రిమాండ్ దరఖాస్తు ఏమైందని ధర్మాసనం ప్రశ్నించింది. అది రిటర్న్ అయిందని ఎంపీ తరఫు న్యాయవాది తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకొని 24 గంటలు గడిచిన నేపథ్యంలో.. ఎంపీ పోలీసు కస్టడీలో లేనట్లేనని, స్వేచ్ఛగా ఉన్నట్లేనని అన్నారు. 24 గంటలు గడిచాక కూడా కస్టడీలో ఉంచుకుంటే పోలీసులు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎంపీ అరెస్ట్ విషయంలో స్పీకర్ అనుమతి తప్పనిసరి అన్నారు. దీనికి ఏఏజీ బదులిస్తూ స్పీకర్ అనుమతి అవసరం లేదని, అరెస్ట్ గురించి ఆయనకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని చెప్పారు. అరెస్ట్ సమయంలో ఎంపీకి చెందిన సీఆర్‌పీఎఫ్ భద్రతా సిబ్బంది సీఐడీ అధికారులపై ఆయుధాల్ని గురిపెట్టారన్నారు. భద్రతాసిబ్బంది ఉన్నది చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడేవారిని రక్షించడానికి కాదన్నారు. ప్రస్తుతం ఎంపీ నిందితుడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని ఏఏజీ చెప్పారు.
ఎంపీనే కొడితే.. ప్రజల పరిస్థితేంటి?
రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీలో పోలీసుల వ్యవహార శైలి చాలా దురదృష్టకరం. వారి తీరు చట్టబద్ధపాలన (రూల్ ఆఫ్ లా)కు విరుద్ధంగా ఉంది. ఎంపీ రఘురామ కృష్ణరాజును ఈ నెల 14న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు ఏపీలోని సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అదే రోజు హైకోర్టులో అత్యవసరంగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాం. జస్టిస్ సురేశ్‌రెడ్డి శనివారం పూర్తి స్థాయి విచారణ జరుపుతాం.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అప్పటి వరకు పోలీసు కస్టడీలో ఉంచాలని శుక్రవారం మౌఖిక ఆదేశాలిచ్చారు. ఆ మేరకు వ్యవహరిస్తామని అదనపు ఏజీ సైతం కోర్టుకు హామీ ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సురేశ్‌రెడ్డి.. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలంటూ పిటిషన్ను కొట్టేశారు. ఈ నేపథ్యంలో రిమాండ్ నిమిత్తం గుంటూరులోని మెజిస్ట్రేట్ కోర్టులో ఎంపీని హాజరుపరచడానికి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఎంపీ శరీరానికి, కాళ్లకు, పాదాలకు గాయాలైన విషయం వెలుగు చూసింది. గాయాలకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్ ద్వారా మీ (న్యాయమూర్తుల) దృష్టికి తెచ్చాను. పోలీసు దెబ్బలకు ఎంపీ నడవలేని స్థితిలో ఉన్నారు. బాధితుడు సాధారణ వ్యక్తి కాదు.. పార్లమెంట్ సభ్యుడు. ఓ ఎంపీనే పోలీసులు ఆ విధంగా కొడితే.. రాష్ట్రంలోని సాధారణ ప్రజల పరిస్థితేంటి? పోలీసుల చర్యలు సుప్రీంకోర్టు డీకే బసు కేసులో ఇచ్చిన తీర్పునకు విరుద్ధం. పోలీసులు కొట్టినట్లు ఎంపీ ఇచ్చిన వాంగ్మూలాన్ని గుంటూరు కోర్టు మెజిస్ట్రేట్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే ఎంపీని డీజీపీ నేతృత్వంలో హైకోర్టులో హాజరుపరిచేలా ఆదేశించండి’ అని కోరారు.
విద్వేషాలు రెచ్చగొట్టారు.. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావన
రెడ్డి కులానికి, క్రైస్తవ మతానికి రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆ రెండు సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణరాజు విద్వేషాలు రెచ్చగొట్టారని ఎఫ్‌ఐఆర్‌లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పేర్కొంది. ఈ తరహా వ్యాఖ్యలతో ఆయన ప్రజా సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని వివరించింది. దేశద్రోహంతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులో ఆయనతో పాటు రెండు తెలుగు టీవీ ఛానళ్లు, ఇతరులను నిందితులుగా పేర్కొంది. ఆ ఎఫ్‌ఐఆర్ ప్రతి శనివారం వెలుగుచూసింది. సీఐడీ డీఐజీ ఈ నెల 13న ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా సుమోటో కేసు నమోదు చేసినట్లు ఇందులో పేర్కొంది. ‘రఘురామకృష్ణరాజు తన వ్యాఖ్యల ద్వారానే కాక చేతలు, హావభావాల ద్వారా తన అనుచరుల్ని హింసకు ప్రేరేపించారు. ఈ చర్యలన్నీ దేశద్రోహం కిందికే వస్తాయి. రెండు మీడియా ఛానళ్ల అధిపతులతో కలిసి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారు’ అని ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు.
ఇదీ చదవండి