ఒకరినొకరు విడిచి ఉండలేమన్నా... ఆ ప్రేమికుల ప్రేమను అర్థం చేసుకోలేదు. వారి పెళ్లికి గౌరవం ఇవ్వలేదు. సరికదా... తల్లి కాబోతున్న కూతురిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన అమానవీయ ఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటు చేసుకుంది. జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సునీత (19) అదే గ్రామానికి చెందిన రవికుమార్ (23) ప్రేమించుకున్నారు. ఇంట్లో వారికి విషయం చెప్పినా పెద్దలు అంగీకరించలేదు.
వారి ప్రేమను గెలిపించుకునేందుకు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సునీత 8 నెలల గర్భిణి. ఆమెకు విశ్రాంతి అవసరమని డాక్టర్ చెప్పటంతో... రవికుమార్ ఆమెను తమ బంధువుల ఇంటి వద్ద ఉంచారు. విషయం తెలుసుకున్న సునీత తల్లి వెంకటమ్మ, అక్క సరిత మంగళవారం ఆమె వద్దకు వెళ్లారు. అయిపోయిందేదో అయిపోయింది... అమ్మాయిని ఆస్పత్రిలో చూపిస్తామని నమ్మించి ఆటోలో తీసుకెళ్లారు.
అనుమానం వచ్చి వెళ్లేసరికే..
ఈ విషయం తెలియటంతో రవికుమార్ అనుమానం వచ్చి ఊర్కొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సునీత బంధువు ఒకరు కల్వకుర్తిలో నర్సుగా పనిచేస్తారు. అదే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు అక్కడికి వెళ్లగా... సునీతకు ఆపరేషన్ చేసి బిడ్డను తొలగించిన విషయం వెలుగుచూసింది. ఈ ఘటనతో రవికుమార్ ఖంగుతిన్నాడు. సునీత తల్లి, సోదరి, శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు డా.శ్రీవాణి, ఇందుకు సహకరించిన నర్సుతోపాటు మరో ఆరుగురు బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిని, సోదరిని రిమాండ్‌కు తరలించామని ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. వైద్యురాలితోపాటు మిగతావారు పరారీలో ఉన్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి: ప్రేమోన్మాదులు ‘బతుకు’నీయడం లేదు