monkeypox: మంకీపాక్స్ లక్షణాలతో హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చేరిన రోగి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ వెల్లడించారు. చేతులు, కాళ్లు, ఛాతీపై దద్దుర్లు ఉన్నాయని.. నీరసం, కాస్త జ్వరం ఉందని తెలిపారు. అతని శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్లాగే ఉన్నాయన్న ఆయన.. వైరస్ నిర్ధారణ కోసం రోగి నుంచి 5 రకాల శాంపిల్స్ సేకరించినట్లు వివరించారు. వాటిని పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రానికి బాధితుడి వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా వైరస్‌కు ప్రజలు ఎక్కువగా భయపడాల్సిన పని లేదని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. రోగికి అతి దగ్గరగా ఉన్న వారికి, రోగి పెద్దగా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోకే అవకాశం లేదని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి శరీరంపై దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
రోగి పరిస్థితి నార్మల్‌గానే ఉంది. శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్ లాగానే ఉన్నాయి. రోగి నుంచి 5 రకాల శాంపిల్స్ సేకరించాం. వాటిని ఎన్.ఐ.వి. పుణెకి పంపిస్తాం. రేపు సాయంత్రానికి బాధితుడి వైద్య టెస్ట్‌ల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారి శరీరంపై దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వాలి. మంకీపాక్స్ గాలి ద్వారా సోకదు. ప్రజలు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. - డాక్టర్ శంకర్, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్
కువైట్ నుంచి వచ్చిన వ్యక్తిలో లక్షణాలు..: తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం గుర్తించారు. వెంటనే అప్రమత్తమై.. అతడిని హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలున్నట్లు బయటపడింది. ఈ నెల 6న అతడు కువైట్ నుంచి కామారెడ్డి వచ్చారు. 20న జ్వరం వచ్చింది. 23 నాటికి ఒళ్లంతా రాషెస్ రావడంతో మరుసటి రోజు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీపాక్స్ లక్షణాలున్నట్టు గుర్తించడంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. రోగితో కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించి వారినీ ఐసోలేషన్ చేశారు.
ఇవీ చూడండి