అంతర్వేది ఆలయ రథం దగ్ధమైన ఘటనలో కారకులు ఎంతటి వారైన కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు సీఎం జగన్ ఆదేశించారని... నూతన రథం నిర్మాణానికి ఆదేశాలిచ్చారని అన్నారు. భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంతర్వేది ఆలయ ఈవో సహా పలువురు సిబ్బందిని సస్పెండ్ చేశామని వివరించారు. ఘటనను రాజకీయం చేసి ప్రయోజనం పొందేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు.
విశ్వహిందూ, భజరంగ్ దళ్ ముసుగులో కొన్ని శక్తులు విధ్వంసం చేసేందుకు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉండి ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అంతర్వేది ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి
పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు: ఎన్జీటీ