రాష్ట్ర ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం... ఆబ్కారీ శాఖ పరంగా రూ.1500 కోట్లు, వాణిజ్యశాఖ పరంగా రూ.4500 కోట్లు మొత్తం రూ.6000 కోట్ల ఆదాయాన్ని నష్టపోయిందని చెప్పారు.
అయినప్పటికీ తమ ప్రభుత్వానికి ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేశారు. బయట అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. అన్ని బార్లు, షాపుల్లోని స్టాకును పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నాటుసారా, ఎన్డీపీఎల్ పై ప్రత్యేక దాడులు నిర్వహించే దిశగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని దిశా నిర్దేశం చేశారు.
లాక్ డౌన్ సమయంలో 2791 కేసులు నమోదు చేసి, 2849 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని మంత్రికి అధికారులు వివరించారు. సుమారు 22 వేల లీటర్ల ఐడీని సీజ్ చేశామని వెల్లడించారు. 2100 కేసులు ఐఎమ్ఎల్, 1500 కేసుల బీర్లు, 1457 కేసుల ఎన్డీపీఎల్ సీజ్ చేశామన్నారు. బార్లలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్ముతున్నారని వచ్చిన కథనాల్లో వాస్తవం ఉందని చెప్పారు. తమ దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్సైజ్, రెవెన్యూ శాఖలు కలిసి విచారణ చేపడుతున్నట్టు మంత్రికి తెలిపారు.
ఇదీ చదవండి: