రాజధాని విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోయినా... ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైపవర్ కమిటీ తుది నివేదిక ఇచ్చాక అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. చంద్రబాబు వల్లే అమరావతి రైతులు అగమ్యగోచరంలో పడ్డారని ఆరోపించారు. అమరావతిని రాజధానిగా తీసేస్తామని సీఎం జగన్ ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు. రాజధాని రైతులకు తిరిగి భూములు ఇచ్చేస్తామని ఎన్నికల ముందే జగన్ చెప్పారని వెల్లడించారు. ప్రతిపక్షాలు చెప్పినట్లే జరిగినా.. అమరావతిలోనే అసెంబ్లీ ఉంటుందని... ఇక ఇబ్బందేముందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏది చెబితే అదే చేస్తారని మంత్రి స్పష్టం చేశారు.
శీతాకాల సమావేశాలు సీమలో నిర్వహించాలి...
రాయలసీమ నుంచి అమరావతికి రావడమే కష్టమనుకుంటే... ఇప్పుడు విశాఖను రాజధాని చేస్తామని ప్రభుత్వం అంటోందని ఎంపీ టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని.. లేదంటే ఏపీ మూడు రాష్ట్రాలయ్యే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో 44వ అంతర్రాష్ట్ర ఇంటర్ జోనల్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమంలో మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, కన్నబాబుతో పాటు ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు వస్తుందనే నమ్మకం తమకు లేదని... అసెంబ్లీ శీతాకాల సమావేశాలను రాయలసీమలో నిర్వహించాలని కోరారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరిగాక తమని తరిమేయరని గ్యారంటీ ఉందా అని వెంకటేష్ ఆనుమానం వ్యక్తం చేశారు.