ప్రశ్న: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో రెండొందల మూడుపై తెలంగాణ ప్రభుత్వానికున్న అభ్యంతరాలు ఏమిటి?
జవాబు: రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85(8) ప్రకారం ఏ రాష్ట్రమైన కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలంటే అపెక్స్ కమిటీ, కృష్ణా నదీజలాల బోర్డు అనుమతి తీసుకోవాలి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ నీటి తరలింపునకు రాత్రికి రాత్రే జీవో విడుదల చేసింది. ఇది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది.
ప్రశ్న: తమకు కేటాయించిన ప్రకారమే నీటిని తీసుకుంటున్నామనే ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై మీ అభిప్రాయం?
జవాబు: నీటి కేటాయింపుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి. అదే విధంగా నాగార్జున సాగర్‌కు ఆధారమైన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలిస్తే తెలంగాణకు నీరెట్లా వస్తుంది. దీనివల్ల హైదరాబాద్‌లో తాగునీటి సమస్య తలెత్తుతుంది. పలు సాగునీటి ప్రాజెక్టులకు నీటి ఎద్దడి వస్తుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నీరందని పరిస్థితి రావొచ్చు.
ప్రశ్న: తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా తమ హక్కు ప్రకారం నీళ్లు తీసుకుంటుంటే తెలంగాణకు ఉన్న అభ్యంతరమేమిటన్న ఏపీ నిర్ణయంపై మీరేమంటారు.?
జవాబు: ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం కంటే తక్కువ ఉన్నప్పుడు నీటిని తరలించడం తగదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి పదవులకు రాజీనామాలు చేశాం. గతంలో పెంచిన దానిపైనే నేటికీ ట్రిబ్యునల్‌లో పోరాడుతున్నాం... అలాంటిది ఇప్పుడు మళ్లీ ఇప్పుడు పెంచితే ఎలా అంగీకరిస్తాం.
ప్రశ్న: తెలంగాణ ప్రభుత్వం తరఫున... ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏచర్యలు తీసుకుంటారు?
జవాబు: ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. కేఆర్ఎంబీకి లేఖ రాస్తాము. ట్రిబ్యునల్‌లో కూడా తెలంగాణ తరఫున గట్టిగా వాదనలు వినిపిస్తాం. జీవోను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.
ఇదీ చదవండి: వేరే ఉపాధి చూసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులు