అన్నదాతల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సీఎం జగన్ రైతు పక్షపాతిగా నిలుస్తున్నారని ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. నివర్ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిహారం పంపిణీ ప్రారంభించారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మేకపాటి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా సీఎం జగన్ రాజకీయాలకే గుర్తింపు తీసుకొచ్చారని ప్రశంసించారు.
నెల్లూరు జిల్లాలో పంట నష్టపోయిన 30వేల మంది రైతులకు రూ. 27.27కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లు మంత్రి తెలిపారు. 80 శాతం సబ్సిడీతో 15వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రైతు భరోసా మూడో విడత కింద జిల్లాలో 2.43 లక్షల మంది రైతులకు 61.78 కోట్ల రూపాయలు అందజేసినట్లు వివరించారు. తక్కువ సమయంలోనే రైతులకు పరిహారం అందించి రైతులను ఆదుకున్నామని అన్నారు.
పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీని ముట్టడిస్తామని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారో తెలియని పవన్... రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి
ఎస్‌ఈసీ ఆదేశాలు నిలిపివేయాలని పిటిషన్.. డిస్పోజ్ చేసిన హైకోర్టు