Minister Amarnath : మూడు రాజధానుల అంశాన్ని ప్రజాభిప్రాయం (రెఫరెండం)గా తీసుకొని 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. అప్పటితో రాజధాని అమరావతికి ముగింపు కార్డు పడుతుందన్నారు. మంగళవారం అనకాపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో, ఆ తర్వాత విశాఖలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవాలని ఓ దండు మన ప్రాంతానికి బయలుదేరిందని, వారిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతుల యాత్ర దేవుడిని చూడడానికి అయితే ఫర్వాలేదని, తమ ప్రాంతానికి వచ్చి ఇది అభివృద్ధి చెందకూడదని మొక్కుతామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయి తీరుతుందని స్పష్టం చేశారు. ‘రేపు అసెంబ్లీలో కావొచ్చు, మరో సమావేశంలో కావొచ్చు. మళ్లీ మూడు రాజధానుల బిల్లు వస్తుంది. దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు..’ అని పేర్కొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా బలపరిచిన సీతంరాజు సుధాకర్‌ను గెలిపించి మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నట్లు తెలియజేద్దామని కార్యకర్తలకు మంత్రి అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. విశాఖలో ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదా అని మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు. రుషికొండపై పరిపాలన భవనాలు నిర్మిస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం అన్నీ ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
త్వరలోనే రాజధాని తరలింపు
విశాఖ జిల్లాలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్న తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించుకుని త్వరలోనే రాజధాని తరలింపు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతానికి అన్యాయం చేయడానికి వస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలియజేద్దామన్నారు.
ఓటర్ల చేర్పులకువాలంటీర్లను వినియోగించుకోండి
ప్రభుత్వ విప్, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ
ఈనాడు డిజిటల్, అనకాపల్లి: వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కొత్తగా 50 నుంచి 60 మంది వైకాపాకు అనుకూలమైన వారిని ఓటర్లుగా చేర్పించాలని ప్రభుత్వ విప్, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ స్థానిక నేతలకు సూచించారు. అనకాపల్లిలో మంగళవారం జరిగిన జిల్లా వైకాపా సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనికోసం ప్రతి నియోజకవర్గానికి నలుగురు చొప్పున ప్రత్యేకంగా నియమించామన్నారు. వీరిని ఎంపీడీవోల దగ్గరకు తీసుకువెళ్లి వాలంటీర్లతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించాలన్నారు. ఓటర్ల చేర్పుల విషయంలో వాలంటీర్లే 50 శాతం పని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. సమన్వయ బాధ్యతను ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: