Milk shortage: తెలంగాణలో పాల కొరత తీరే మార్గమే కానరావడం లేదు. ప్రజలకు నిత్యం నాణ్యమైన పాలు విక్రయించాల్సిన ‘రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య’కు చెందిన విజయ డెయిరీ వెలవెలబోతోంది. వానాకాలమొచ్చినా రాష్ట్రంలో పల్లెల్లో పాల సేకరణ పెరగక.. నిత్యం కర్ణాటక నుంచి లక్ష లీటర్ల దాకా కొని ఇక్కడ ప్రజలకు విక్రయిస్తోంది.
ఈ డెయిరీకి 10 నెలలుగా మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)ని రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదు. రిటైర్డు అధికారి అయిన అధర్‌సిన్హాను రాష్ట్ర పశుసంవర్ధకశాఖకు ప్రభుత్వం కార్యదర్శిగా నియమించి, ఆయనకే ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన డెయిరీకి రావడమే అరుదు కావడం.. శాశ్వత ఎండీ లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని పాడి రైతుల సహకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సమాఖ్య’కు ఛైర్మన్‌గా ఉన్న లోకా భూమారెడ్డి పదవీకాలం ఈ నెలలోనే ముగిసింది. ఎండీ, ఛైర్మన్ లేకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగులపై పర్యవేక్షణ లేక మొక్కుబడిగా డెయిరీని నడిపిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని పాడి రైతులు కోరుతున్నారు.
రోజూ లక్ష లీటర్ల కొరత: రోజుకు 3.50 లక్షల లీటర్లు డెయిరీకి అవసరం కాగా.. కానీ ప్రస్తుతం రాష్ట్ర రైతుల నుంచి నిత్యం 2.50 లక్షల లీటర్లలోపే వస్తున్నాయి. ఏటా జూన్ నుంచి వర్షాకాలంలో పాడి పశువుల నుంచి పాల ఉత్పత్తి పెరిగి డెయిరీల సేకరణ పెరుగుతుంది. కానీ గ్రామాల్లో పాడిరైతులను ప్రోత్సహించే అధికారులు లేక సేకరణ పెరగడం లేదు. గతంలో జనగామ జిల్లా నుంచి రోజుకు 35 వేల లీటర్లకు పైగా పాలు డెయిరీకి రైతులు ఇచ్చేవారు.
ఇప్పుడు అవి 23 వేల లీటర్లకు పడిపోయాయి. ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి తదితర జిల్లాల రైతులు డెయిరీ వైపు మొగ్గు చూపడంలేదు. లీటరు పాల ధరకు అదనంగా రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయిన రెండేళ్లుగా ఈ నిధులు విడుదల కాలేదని అందుకే రైతులకు డెయిరీ చెల్లించలేదు. పాడి పశువును కొన్న రైతుకు రూ.10 వేల రాయితీ ఇవ్వడం లేదు. పశువు మరణిస్తే బీమా పరిహారం అందించడంలేదు. దీంతో డెయిరీ అభివృద్ధి పడకేసి కర్ణాటక, ఏపీ రాష్ట్రాల పాలను కొనాల్సిన దుస్థితి నెలకొంది.
రైతుల్లో నిరాశ: "రాష్ట్రంలో పాడిరైతుల అభివృద్ధికి విజయ డెయిరీ సహకరించనందున పాల ఉత్పత్తి పెరగడం లేదు. ప్రైవేటు డెయిరీలు అధిక ధర చెల్లిస్తూ పోటీపడి పాలను కొంటుంటే విజయ డెయిరీ కనీసం ధర పెంచకపోగా ఇవ్వాల్సిన రూ.4 ప్రోత్సాహకం బకాయిలను విడుదల చేయకుండా రైతులను సతాయిస్తోంది. డెయిరీ పాలనాతీరు రాజులేని రాజ్యంలా మారి రైతులు నిరాశకు గురవుతున్నారు. పాడి రైతుల సమస్యలను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు". -సోమిరెడ్డి, పాడి రైతుల సహకార సంఘం అధ్యక్షుడు, జనగామ జిల్లా
ఇవీ చదవండి: