Medical Physics Course in M.Sc: ఐఐటీ హైదరాబాద్ మరో కొత్త కోర్సును అందుబాటులోకి తెస్తోంది. మూడేళ్ల కాల వ్యవధితో ఎమ్మెస్సీలో మెడికల్ ఫిజిక్స్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రితో కలిసి ఈ కోర్సుకు రూపకల్పన చేసింది. రెండేళ్లపాటు ఐఐటీలోని ఆచార్యుల పర్యవేక్షణలో విద్యార్థులు వివిధ అంశాలను నేర్చుకుంటారు. మూడో ఏడాది బసవతారకం ఆసుపత్రిలో నిష్ణాతులైన వైద్యబృందంతో కలిసి పనిచేస్తారు.
ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. అప్లయిడ్ ఫిజిక్స్‌ను ఉపయోగించి వివిధ రకాల రోగాలకు సంబంధించి నివారణ, నిర్ధారణ, చికిత్సలు, ఆవిష్కరణల రూపకల్పన నైపుణ్యాలను ఈ కోర్సుతో సంపాదించవచ్చని తెలిపింది.
ఏఈఆర్‌బీ అనుమతితో.. ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్‌బీ) నుంచి ఈ కోర్సుకు అనుమతి లభించింది. ఈ కోర్సులో భాగంగా రేడియేషన్ ఫిజిక్స్, క్లినికల్ లెక్చర్స్, స్వల్పకాలిక ప్రాజెక్టులు తదితర అంశాలుంటాయి. వైద్యరంగంలో ఒక సంస్థతో కలిసి వినూత్నంగా దీనిని అందుబాటులోకి తెస్తున్నారు. ‘వైద్యరంగంలో మేం ప్రవేశపెడుతున్న మూడో కోర్సు ఇది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని ఐఐటీ హైదరాబాద్ సంచాలకులు ఆచార్య బీఎస్ మూర్తి వివరించారు. ప్రవేశాలు, ఇతర సమాచారాన్ని https://cip.iith.ac.in/ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవీ చూడండి..
వేతన జీవులపై మరో పిడుగు.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం