ఎంపీ రఘురామ కృష్ణరాజుకు గాయాలు కాలేదని మెడికల్ బోర్డు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. పాదాలు వాచి ఉండటం, రంగు మారటం మినహా.. పైన గాయాలైనట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు శనివారం రాత్రి 10 గంటల తర్వాత అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఎక్స్‌రే, ఇతర పరీక్షలు నిర్వహించారు. జనరల్ మెడిసిన్, ఆర్థో, న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జన్ విభాగాల వైద్యులు ఆయన గాయాలను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలోని నాట్కో భవనంలో ఎంపీకి బస కల్పించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన మెడికల్ బోర్డులోని వైద్యులు ఆదివారం ఉదయం 10 గంటలకు ఎంపీ గాయాలను వేర్వేరుగా పరిశీలించారు. వారంతా కలిసి నివేదిక సిద్ధం చేసి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు అందజేశారు. ఆయన దాన్ని సీల్డు కవర్‌లో గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గోపీచంద్‌కు అందజేశారు. దాన్ని ఆయన సాయంత్రం హైకోర్టుకు చేర్చారు. సీఐడీ పోలీసులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎంపీని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జైలులో 3468 ఖైదీ నంబరు కేటాయించారు.
ఇదీ చదవండి
మెజిస్ట్రేట్ ఉత్తర్వులనూ పట్టించుకోరా.. సీఐడీపై హైకోర్టు ఆగ్రహం