రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురానికి చెందిన కంచర్ల మంగమ్మకు 73 ఏళ్లు. మహేందర్‌రెడ్డికి బంధువు కూడా అయిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా రెక్కలు వచ్చాక తలోదిక్కు ఎగిరిపోయారు. భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా మిగిలింది. చుట్టూ శిథిలాల మధ్య రేకుల పైకప్పే ఆవాసం. ప్రభుత్వం ఇచ్చే రూ. 2,000 పింఛనే ఆధారం. ఇరుగుపొరుగు వారు పెట్టేదే ఆహారం.
ఎలాగో పూట గడిచిపోతోంది అనుకుంటుండగా రెండ్రోజుల క్రితం గాలిదుమారానికి పైకప్పు ఎగిరిపోయింది. గత వైభవానికి చిహ్నంగా మిగిలిన మొండి గోడల మధ్య ఇప్పుడామె ఓ జీవచ్ఛవం. ఎండలకు అల్లాడిపోతున్న ఒంటరితనం. డీజీపీ మహేందర్‌రెడ్డిని చిన్నతనంలో తన ఒళ్లో లాలించాననీ, తల్లిలాంటి తనను ఆయన తప్పకుండా ఆదుకుంటారని ఆశిస్తోంది. కనీసం కుమారులు తనను సాకేలా ఒప్పిస్తారేమోనని కొండంత ఆశతో ఎదురుచూస్తోంది మంగమ్మ.