Man enters lion enclosure: హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. సింహాలు ఉండే ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లాడు. ఆఫ్రికన్ జాతికి చెందిన సింహాలు ఉండే ఎన్‌క్లోజర్ దగ్గిరికి వెళ్లిన యువకుడు సమీపంలో ఉన్న రాళ్లపై కూర్చున్నాడు. యువకుడిని గమనించిన సింహం అతనిపై దూకేందుకు ప్రయత్నించింది. సందర్శకులు కేకలు పెట్టినా యువకుడు పట్టించుకోకుండా బండరాయిపైనే కూర్చున్నాడు. యువకుడు ఎత్తైన రాళ్లపై కూర్చోవడంతో సింహానికి దాడి చేయడం సాధ్యం కాలేదు. సందర్శకులు కేకలు వేయడంతో కాస్త వెనక్కి తగ్గింది.
సింహం దృష్టి మరల్చడంతో...
ఓ వైపు కేర్ టేకర్ కూడా సింహం దృష్టి మరల్చేలా ప్రయత్నించాడు. అప్రమత్తమైన జూపార్కు సిబ్బంది అక్కడికి చేరుకొని యువకుడిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అత్యుత్సాహం ప్రదర్శించిన యువకుడు సాయికుమార్‌ను జూ సిబ్బంది.. పోలీసులకు అప్పగించారు. జూపార్క్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మతిస్థిమితం లేకనే..
సింహాలు ఉండే స్థలంలో ముందు వైపు పూర్తిగా ఫెన్సింగ్ ఉంటుంది. వెనక వైపు ప్రహరీ నిర్మించారు. ఫెన్సింగ్ ఉన్న వైపు నుంచి సందర్శకులు సింహాలను చూసే అవకాశం ఉంటుంది. యువకుడు మాత్రం వెనుకవైపు ప్రహరీ ఎక్కి సింహాలుండే ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లాడు.
యువకుడిని కీసరకు చెందిన సాయి కుమార్‌గా పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం తల్లిదండ్రులు మృతి చెందడంతో మతిస్థిమితం కోల్పోయి రహదారుల వెంట తిరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సాయికుమార్ బంధువుల వివరాలు సేకరించిన పోలీసులు.. కీసరకు వెళ్లి అతడిని వారికి అప్పగించారు.
ఇదీ చదవండి
AMARAVATI INCIDENTS: అమరావతి బిల్లు నుంచి 3 రాజధానుల ఉపసంహరణ వరకు.. అసలేంజరిగిందంటే ?