దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా 4.5 కి.మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ప్రకటించింది. రాగల 24 గంటలలో అల్పపీడనం మరింత బలపడి, తదుపరి 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
అల్పపీడనం బలపడి మే 6వ తేదీ వరకు ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే సూచనలు ఉన్నాయని ప్రకటించింది. రాగల 48 గంటల్లో అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30 నుండి 40 కి.మీ)తో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
రాయలసీమలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.
ఇదీ చదవండి : కనీసం లక్ష పడకలు సిద్ధం చేయండి: సీఎం జగన్