Rain In AP:అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నేడు, రేపు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షాల నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు. లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా తెలిపారు.
వైఎస్సార్ జిల్లా కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై నిర్మించిన అప్రోచ్ రోడ్డు... 3 నెలల వ్యవధిలోనే మూడోసారి తెగిపోయింది. కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో.. ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వాహనాలను దారి మళ్లించడానికి ప్రయత్నాలు చేపట్టారు.
గువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో.. నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. జలాశయం నుంచి 13 వేల 500 కూసెక్కుల నీటిని కుందూ నదిలోకి విడుదల చేస్తున్నారు. కుందూ నదిలో అధిక ప్రవాహం కారణంగా నంద్యాల హరిజనపేట వద్ద ఉన్న మద్దిలేరు వాగు వంతెనపైనుంచి నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హరిజనపేట, బైటిపేట ప్రాంతాల్లో... జిల్లా కలెక్టర్ మనిజర్ జిలాని పర్యటించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా దర్శిలోని.. పడమటి బజారులో మట్టిమిద్దె కూలి... ఓ మహిళ మృతిచెందారు. 32 ఏళ్ల కాశమ్మ అనే మహిళ.. రాత్రి నిద్రిస్తున్న సమయంలో మట్టి మిద్దె పైకప్పు కూలడంతో.. అక్కడికక్కడే మరణించారు.
ఏలూరు జిల్లా T.నర్సాపురం ఎర్రచెరువు కాలనీని వరద ముంచెత్తడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండ్రుజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద జంగారెడ్డిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నివాసాల్లోకి వరద చేరడంతో స్థానికులు రోడ్లపైకి వచ్చారు. నివాసాల మధ్య ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో.... ఇళ్లలోని సామగ్రి కొట్టుకుపోయింది. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా... సమస్య పరిష్కరించేవారే కరవయ్యారని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరంలోని స్వయంభు విఘ్నేశ్వర ఆలయంలోకి వర్షపు నీరు చేరి.. మూల విరాట్ విగ్రహం 3 అడుగుల మేర మునిగిపోయింది. గర్భగుడిలోకి చేరిన చేరిన నీటిని బయటకు పంపేలా చర్యలు చేపట్టారు. మాడుగుల నియోజకవర్గంలోని రైవాడ, పెద్దేరు, కోనాం జలాశయాల్లోకి వరద పోటెత్తుతుండటంతో... అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా.. పాచిపెంట, సాలూరు మండలాల్లో వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. వందల ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. నీరు చేరి.. పత్తి కాయలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయుడుచెరువు, చెరుకుపల్లి గెడ్డ పొంగి.. సాలూరులోని లోతట్టు ప్రాంతాలు, ఇళ్లలోకి వరద చేరింది. లెప్రసీ మిషన్ హాస్పిటల్ వద్ద రహదారిపై నీరు చేరడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని లోతట్టు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పెద్దరోకళ్లపల్లి, పాత నౌపడ పంచాయతీ పరిధి గ్రమాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో వరి పంట... రెండ్రోజులుగా మునకలోనే ఉండటంతో.. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి పలు పర్యాయాలు చిరుజల్లులు కురిశాయి. ఓ వైపు ఎండ కాస్తున్నా... వర్షం కురవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇవీ చదవండి: