తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకులలో వేర్వేరు చోట్ల ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రోజున పురుగుల మందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రియుడి మరణవార్త తెలిసి యువతి బావిలో దూకి చనిపోయింది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాల సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
కనుల గ్రామానికి చెందిన సుస్మిత, శివ అనే యువతీయువకులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. గ్రామంలో పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాలు పంచాయతీ నిర్వహించి.. ప్రేమ వివాహానికి కాస్త సమయం తీసుకోవాలని ఈ ప్రేమజంటకు నచ్చజెప్పారు. సమయం తీసుకుంటే తమను దూరం చేస్తారనే భయంతో.. కలిసి జీవించటం సాధ్యపడుతుందో... లేదోనన్న మనోవేదనతో వారం క్రితం శివ పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రోజున ప్రాణాలు కోల్పోయాడు. ప్రియుడి మరణాన్ని జీర్ణించుకోలేక సుస్మిత.. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఇద్దరి ఆత్మహత్యకు సంబంధించి వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు.