Venkateshwara temple: రాజధాని అమరావతిలోని వెంకటపాలెం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ, విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాసంప్రోక్షణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముఖ మండపంలో గవర్నర్‌ను తితిదే ఛైర్మన్ శాలువాతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. గవర్నర్‌ను వేద పండితులు ఆశీర్వదించారు. తర్వాత భక్తులను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. హిందూ ధర్మప్రచారంలోభాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రసంగిస్తూ అద్భుతమైన శిల్పకళతో ఆలయ నిర్మాణం జరిగిందని, సాక్షాత్తూ తిరుమల వెంకన్న వచ్చాడా అనేలా మూలమూర్తి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో గురువారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. సాయంత్రం శ్రీనివాస కళ్యాణం, ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
హాజరుకాని సీఎం: మహాసంప్రోక్షణ, విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సీఎం జగన్ హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది.
ఇవీ చదవండి: