ఫిట్‌నెస్ మంత్ర ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్‌ల జోరు కాస్త తగ్గినా బాడీ ఫిట్‌గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందనే భావనతో చాలామంది జిమ్, ఫిట్‌నెస్ సెంటర్ల వెంట పరుగులు పెడుతున్నారు. లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా జిమ్‌లన్నీ మూతపడే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు అనేక రంగాలకు ఇచ్చినా జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లకు ఇవ్వలేదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో, వ్యాయమం కూడా అంతే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. కరోనా నివారణకు మెరుగైన ఆరోగ్యం ఎంతో అవసరమైన తరుణంలో జిమ్‌లకు అనుమతులు ఇవ్వకపోవటంతో నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు
వ్యాయామం ఒత్తిని దూరం చేయటంతోపాటు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని వైద్యుల భావన. మారుతున్న జీవనవిధానం వల్ల వ్యాయామం తప్పనిసరి అంటున్నారు. వ్యాయామం చేసేందుకు అనుకూలమైన ఇలాంటి జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లకు అనుమతి ఇవ్వకపోవటంతో యువత నిరాశ చెందుతున్నారు. రద్దీగా ఉండే స్థలం, తరచూ తాకే పరికరాలు, ఆరోగ్య క్లబ్‌లు కరోనావైరస్ సంక్రమణకు దారితీస్తాయనే వాదనా ఉంది. కరోనా వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, అన్నింటినీ పరిశీలించి తమకు అనుమతులు ఇవ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు.
వ్యాయామం తప్పనిసరి
శారీరక శ్రమ రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు కచ్చితంగా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. వ్యాయామశాలలో సురక్షితంగా వ్యాయామం చేసేందుకు గ్లౌజులు వాడడం, పరికరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయటం, లోనికి వచ్చే వారు చేతులు శానిటైజ్ చేసుకోవటం, థర్మల్ స్క్రినింగ్ వంటి చర్యలతో సమస్యలు అధిగమించవచ్చని జిమ్ సెంటర్ల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.
ఉపాధి కోల్పోయాం
ఒక్కో జిమ్ సెంటర్లో సగటున 10 నుంచి 30 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. లాక్డౌన్ కారణంగా వారంతా ఉపాధి కోల్పోయారు. ఇంట్లో చేసుకునే చిన్నపాటి వ్యాయామాలు ముఖ్యమే అయినా, సరైన శిక్షకుల పర్యవేక్షణలో జిమ్ చేస్తేనే మెరుగైన ఆరోగ్యం సొంతమని వారంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో జిమ్‌లు మూతపడడంతో వ్యాయామం కరవైందని వినియోగదారులు అంటున్నారు. వ్యాయామ శిక్షకులు, వైద్యుల సూచనలతో హోమ్ వర్కవుట్స్ సాధన చేస్తున్నామంటున్నారు.
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమవడం, వ్యాయామాలు చేయకపోవడంతో ఫిట్‌నెస్ కోల్పోయేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకూ వ్యాయామాలు చేయనివాళ్లు, పూర్వ అనుభవం ఉన్నవాళ్లూ ఇంటిపట్టునే ఫిట్‌నెస్ పెంచుకోవడం అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి : మట్టిని కరిగించేయ్... జేబులు నింపేయ్...