Local cadre Report: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానంలో భాగంగా సొంత జిల్లాలకు బదలాయించిన ఉద్యోగుల్లో 25 శాతం మంది మంగళవారం కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల వద్ద రిపోర్ట్ చేశారు. వారిని లోకల్ కేడర్‌కు కేటాయించినట్లు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఉన్నతాధికారుల వద్ద రిపోర్ట్ చేసేందుకు మూడు రోజుల గడువునివ్వగా తొలిరోజే భారీగా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వేలమంది ఉద్యోగులను ఇతర జిల్లాల నుంచి సొంత జిల్లాలకు బదలాయించింది. గురువారం నాటికి అందరూ రిపోర్ట్ చేయాలని, ఖాళీలకు, పోస్టులకు అనుగుణంగా వారికి కొత్త పోస్టింగు ఉత్తర్వులు ఇస్తారని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై గురువారం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయనుంది. ఖాళీలతో పాటు ఇతర జిల్లాలకు వెళ్లేవారి స్థానాల్లో కొత్తగా నియమితులైన వారికి అవకాశాలు కల్పిస్తుంది.
జోన్లు, బహుళజోన్లపై కసరత్తు...
జోన్లు, బహుళజోన్ల స్థానాలకు బదలాయింపులపై మంగళవారం సచివాలయంలో కసరత్తు జరిగింది. మరో నాలుగు శాఖలకు సంబంధించిన అధికారులను వారి సొంత జోన్లు, బహుళజోన్లకు కేటాయించే అంశంపై చర్చించారు. ఇంకా ఆరు శాఖలు మిగిలి ఉన్నందున ఈనెల 25 వరకు కేటాయింపులపై సమావేశాలు జరిగే వీలుంది. జిల్లాస్థాయిల్లో పూర్తయినందున మిగిలిన కేటాయింపులు సత్వరమే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం ఆయన బదలాయింపులపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా బదలాయింపులను గడువులోగా పూర్తి చేసిన నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, తదితర జిల్లాల కలెక్టర్లను, ఉన్నతాధికారులను అభినందించారు.
బీసీ ఉద్యోగులకూ స్థానిక జిల్లాలు కేటాయించండి...
ఉద్యోగుల బదలాయింపుల సందర్భంగా ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీ ఉద్యోగులకు సైతం స్థానిక జిల్లాలను కేటాయించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కోరారు.
ఇదీ చూడండి: