విశాఖ మన్యంలో ఉదయం నుంచే ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పాడేరు డివిజన్‌లో 237 పంచాయతీలకు ఎననికలు జరుగుతుండగా.. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మన్యంలో మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకే పోలింగ్ జరగనుండటంతో.. అరకులోయలోనూ ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. విజయనగరం డివిజన్‌లోని 248 గ్రామ పంచాయతీల ఎన్నికలకు 2వేల 30 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 163 గ్రామపంచాయతీలు, 1500 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
కృష్ణా జిల్లా నాగాయలంక, కోసూరివారిపాలెం, అవనిగడ్డలో ఉదయం నుంచే ఓటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మాడుగులలోని 12,13 వార్డుల్లో ఇద్దరు అభ్యర్థులకు ఒకటే గుర్తుతో బ్యాలెట్ పత్రాలు ముద్రించినట్టు గుర్తించిన అధికారులు.. ఈ నెల 21న పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెద్దకండ్లగుంట 5వ వార్డులో.. అధికారులు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని మరో వర్గీయులు ఆందోళన చేస్తుండటంతో... పోలింగ్ నిలిచిపోయింది. కందుకూరు డివిజన్‌లో 236 పంచాయతీల్లో ఎన్నికలకు.. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు.
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
అనంతపురం డివిజన్‌లో 356 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉరవకొండ మూడో వార్డులో పోలింగ్ వాయిదా పడింది. ఓ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నా బ్యాలెట్ పత్రంలో గుర్తు కేటాయించడాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు.. అర్ధరాత్రి తర్వాత వాయిదా నిర్ణయం తీసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని 85 పంచాయతీల్లో ఓటు వేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని 77 గ్రామపంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. కడప జిల్లా రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో పోలింగ్ సాగుతోంది.
ఇదీ చదవండి: చిన్నారికి 'రూ.16కోట్ల' ఉచిత చికిత్స