గుంటూరు జిల్లాలో కేవలం ఒక్క అంకె ఓట్ల తేడాతోనే పలుచోట్ల సర్పంచ్ అభ్యర్థులను అదృష్టం వరించింది. అనుమర్లపూడిలో 1 ఓటుతో సుబ్బలక్ష్మి, పుట్లగూడెం సర్పంచ్‌గా 2 ఓట్లతో తోట పాపారావు, భీమినేనివారిపాలెంలో 3 ఓట్లతో ఆళ్ల శ్రీనివాసరావు గెలిచారు. గోరంట్ల సర్పంచిగా 3 ఓట్లతో మద్దిగుంట్ల వెంకయ్య విజయం సాధించారు. పుసులూరు సర్పంచిగా 9 ఓట్లతో పెద్ది రాధిక, అందుకూరులో 10 ఓట్లతో సౌభాగ్యలక్ష్మి సర్పంచయ్యారు. తోకవారిపాలెం సర్పంచ్‌గా 6 ఓట్లతో దొడ్డా సామ్రాజ్యం, దాసుపాలెంలో 11 ఓట్ల మెజార్టీతో ఆలపాటి వీరయ్య గెలిచారు. వైకుంఠపురంలో 17 ఓట్లతో విఠల్‌రావు విజయం సాధించారు.
ప్రకాశం జిల్లా అక్కపల్లెలో 7 ఓట్లతో సోమిరెడ్డి, చిన్నదోర్నాల సర్పంచిగా 9 ఓట్లతో పోలమ్మ గెలిచారు. నెల్లూరు జిల్లాలోని పైనంపురంలో కేవలం ఒకే ఓటుతో విజయకుమార్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రీకౌంటింగ్‌లో ఆధిక్యం 2 ఓట్లకు పెరిగింది. చిత్తూరు జిల్లాలో పాకాలలో 1 ఓటు తేడాతో కస్తూరి విజయం సాధించారు. మోదుగుల పాళ్యంలో అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా సందిగ్ధం ఏర్పడింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె గల గ్రామ పంచాయతీ కందులవారిపల్లెలో తెదేపా బలపరిచిన అభ్యర్థి గెలుపొందగా... ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరిపారు.
కృష్ణా జిల్లా బూతిమిల్లిపాడు సర్పంచిగా 4 ఓట్లతో సుబ్బారావు విజయం సాధించారు. తూర్పు గోదావరి జిల్లా గాడిలంక సర్పంచ్‌గా 10 ఓట్లతో పెద్దిరెడ్డి మునీంద్రరావు ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురంలో 3 ఓట్లతో అభ్యర్థి గెలిచారు. విశాఖ జిల్లా వెన్నెలపాలెంలో గతంలో 3సార్లు సర్పంచ్‌గా పనిచేసిన తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలత... ఓడిపోయారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ సతీమణి రాంపురం పంచాయతీ సర్పంచ్‌గా విజయం సాధించారు. విజయనగరంలోని కొత్తవలస మేజర్ పంచాయతీలో కేవలం 10ఓట్ల తేడాతో ఫలితం తేలింది.
ఎంపీ సీఎం రమేశ్ స్వగ్రామమైన కడప జిల్లా ఎర్రగుంట్లలో భాజపా బలపరిచిన అభ్యర్థి 3వేల 734 ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు. అనంతపురం జిల్లా మల్లుగూరులో ఇద్దరు అభ్యర్థులకూ 570 చొప్పున సమానంగా ఓట్లొచ్చాయి. అధికారులు టాస్ వేయగా... రమేశ్ అనే అభ్యర్థిని అదృష్టం వరించింది. కర్నూలు జిల్లా హనుమాపురం సర్పంచ్‌గా 10 ఓట్లతో ఇందిరమ్మ విజయం సాధించారు.
ఇదీ చదవండి: కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం