ఇంట్లో అందరూ ఒక దగ్గర ఉన్నారన్న సంతోషం కన్నా.. ఏ క్షణం ఎటువంటి వార్త వినాలో అనే ఆందోళనే ఎక్కవవుతోంది. ఇటువంటి ఒత్తిడి నుంచి బయటపడే ఆలోచనలే ఇవి.
ఇదో ఆవకాశం
మనసులోని ఆందోళన తగ్గాలంటే మనం యాక్షన్ మోడ్‌లోకి దిగాల్సిందే. ప్రతికూల ఆలోచనలు మాని చేయాల్సిన పనులపై దృష్టి పెట్టాలి. లిఫ్ట్‌లో మీట నొక్కడానికి, రెయిలింగ్ పట్టుకోవటానికి భయపడుతున్నప్పుడు.. మెట్లు ఉపయోగించాలి. కుటుంబంతో సమయం గడపాలి. రొటీనుకు భిన్నంగా కొత్తగా ప్రయత్నించాలి. వంటగదిలో ప్రయోగాలు, తోట పని, పుస్తకాలు చదవటం, వ్యాయామం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. ఇలా బిజీగా ఉంటే ఒత్తిడికి చోటు ఎక్కడ ఉంటుంది.
స్నేహం వదలవద్దు
మనం క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు 4 మంచి మాటలు చెప్పే స్నేహితులు, సన్నిహితులు కొందరు ఉంటారు. బాధ, భయంలో ఉన్నప్పుడు వాళ్లతో మాట కలపాలి. అభిప్రాయాలు పంచుకోవాలి.
పెద్దల పాత్ర
యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నవాళ్లు అతిగా భయాందోళనలకు గురవుతుంటారు. వీళ్లని కాచుకొని ఉండాల్సింది పెద్దలే. భయపెట్టే మాటలొద్దు.. పుకార్లు వాళ్ల ముందు ప్రస్తావించవద్దు. కుటుంబ పెద్దలు సానుకూలంగా ఉంటే ఆ ప్రభావం తప్పకుండా పిల్లలపై పడుతుంది
పొల్చుకోండి...
చరిత్రను చూస్తే మానవాళిని పట్టి పీడించిన ఉత్పాతాలెన్నో కనిపిస్తాయి. ప్రపంచయుద్దాలు, భయంకర వ్యాధులు, వాతావరణ ఉపద్రవాలు.. ఎన్నింటినో తట్టుకున్నాం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. తర్వాలోనే టీకా వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అన్నింటికీ మించి మనదేశంలో వైరస్ బారినపడ్డవాళ్లలో అత్యధికుల పరిస్థితి ప్రమాదం లేదంటున్నారు.
అంగీకరించాల్సిందే..
వారాలకొద్దీ ఇంట్లో ఉండలేక.. గోడలు బద్దలు కొట్టుకుని వెళిపోవాలనిపిస్తుంది. అప్పుడేమవుతుంది.. కరోనా కాటేస్తుంది. కాబట్టి ఇంట్లో ఉండాల్సిందే. ఇంతకు మించి ఏం చేయలేం.. అనుకుంటే సగం భారం తగ్గుతుంది
పుకార్లు వద్దు..
సామాజిక మాధ్యమాల్లో గడ్డు పరిస్థితిపై వ్యంగ్య వీడియెలు సృష్టిస్తున్నారు. సరదాగా అనిపించినా ఆలోచనలు తప్పుదోవ పట్టిస్తాయి. పనికిరాని సమాచారాన్ని ఎప్పటికప్పుడు వడగట్టాలి. అటువంటివి అస్సలు షేర్ చేయొద్దు.. నమ్మొద్దు.
ప్రభుత్వాల చొరవ...
ఈ మహమ్మరి వ్యాప్తి నేపథ్యంలో బ్రిటీష్ సైకియాట్రిక్ అసోసియేషన్ ఒక అధ్యయనం చేసింది. అందులో తేలిన వాస్తవం ఏంటంటే.. లాక్ డౌన్ లో ఉన్నప్పుడు ఇంట్లోని జనాల్లో సామాజిక అశాంతులు, గొడవలు, మానసిక సమస్యలు, పిల్లలపై దాడులు ఎక్కువ కావటం గమనించారు. పరిస్థితి మరీ భయానకంగా లేదని చెబుతూ నాయకులు, శాస్త్రవేత్తలు, వైద్యులు.. ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆ అధ్యయనం సూచించింది. - మానసిక నిపుణులు