పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద సీపీఎం నాయకులు ప్లకార్డులతో మోకాళ్లపై నిరసన తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెట్టి నిత్యావసరాల ధరలు పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పెట్రోల్ ధరలు పెంచడాన్ని ఖండిస్తూ కడపలో సీపీఎం ఆధ్వర్యంలో వినూత్నంగా ఆందోళన తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని తోపుడు బండిపై పెట్టి తాళ్లతో కట్టి లాగుతూ నిరసన తెలియజేశారు. కరోనా కారణంగా నానా అగచాట్లు పడుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్ ధరలు పెంచడం దారుణమని సీపీఎం నాయకులు రామ్మోహన్ మండిపడ్డారు.
విశాఖ జిల్లా చోడవరంలో వ్యానుకు తాడు కట్టి లాగుతూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని నిరసనకారులు పేర్కొన్నారు.
- విజయవాడలో...
విజయవాడ నగర శివారు పాయికాపురం కండ్రిక జీ ప్లస్ త్రీ అపార్ట్మెంట్ మెంట్ల ముందు డ్రైనేజీ సౌకర్యం లేక స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై స్ధానికులతో కలిసి సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నగరంలో కరోనా మహమ్మారి తమ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు ఏమీ జరగడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని కోరారు.